
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. ఢిల్లీలోని కొచి భవన్ లో విజయన్ తో సమావేశమై రాష్ట్రంలో వరద నష్టం, సహాయక చర్యలపై చర్చించారు. 766వ నెంబర్ జాతీయ రహదారిపై నైట్ ట్రాఫిక్ బ్యాన్, ప్రతిపాదిత ప్రత్యామ్నాయ మార్గాలపైనా మాట్లాడారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలపైనా విజయన్ తో చర్చించారు. వరద నష్టం, బాధితులకు సాయం, పునరావాస చర్యలపై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు సమావేశం తర్వాత రాహుల్ గాంధీ చెప్పారు.