బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన

బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన

సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కి తరలించారు. దీంతో బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అంతకుముందు రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ కు వెళ్తున్నట్లు చెప్పానా అని పోలీసులను నిలదీశారు. నిరసన తెలపడానికి కూడా హక్కు లేదా అని అడిగారు.