కాంగ్రెస్‌‌లో చేరాలని..కన్ను గీటుతున్నరు : మాగంటి గోపీనాథ్‌‌

కాంగ్రెస్‌‌లో చేరాలని..కన్ను గీటుతున్నరు : మాగంటి గోపీనాథ్‌‌

 సీఎంతో సత్సంబంధాలున్నాయి.. అయినా  పార్టీ మారను

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్‌‌లో చేరాలని ఆ పార్టీ నేతలు తనకు కన్ను గీటుతున్నారని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ కాంగ్రెస్‌‌లో చేరడాన్ని ఆయన తప్పుబట్టారు. తనతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌‌ను, అంబర్‌‌‌‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌‌ను పార్టీలోకి తీసుకొస్తానని కాంగ్రెస్‌‌కు దానం హామీ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. చిల్లర కేసుల నుంచి తప్పించుకునేందుకే దానం కాంగ్రెస్‌‌లో చేరారని, తనపై ఎలాంటి కేసులు లేనందున భయపడే ప్రసక్తే లేదన్నారు.

 బుధవారం ఆయన తెలంగాణ భవన్‌‌లో మీడియాతో చిట్‌‌చాట్ చేశారు. గతంలో తాము పార్టీ మారడానికి ఓ కారణం ఉందని, తెలంగాణలో టీడీపీని వదిలేయాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్‌‌లో చేరి సక్సెస్ అయ్యామని చెప్పారు. రేవంత్​రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌‌ లో చేరేది లేదన్నారు. జైలుకు పోయినోళ్లు సీఎంలు అవుతున్నారని, తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేశారు.

 ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్లిందని, ఆమె సీఎం అవుతుందా? అని ప్రశ్నించగా.. అవుతుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌‌సభ ఎన్నికల్లో ఖమ్మం, సికింద్రాబాద్, మెదక్‌‌, మల్కాజ్‌‌గిరిలో తాము తప్పకుండా విజయం సాధిస్తామన్నారు.