హరీశ్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్

హరీశ్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్
  •     దిష్టిబొమ్మ దహనం..క్షమాపణ చెప్పాలని డిమాండ్

నిర్మల్/మంచిర్యాల, వెలుగు :  రైతుబంధు డబ్బులు ఆపి ఏసీ రూముల్లో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వ హించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఆర్ టీయై రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి రాజేశ్వర్ తదితరుల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద హరీశ్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగులు, టీచర్లపై తప్పు డు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అధికారం కోల్పోయినా హరీశ్ రావు ఇంకా తన అహంకారాన్ని వీడడం లేదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పాలని లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

టీచర్ల సంఘాల విమర్శ

హరీశ్ రావు వ్యాఖ్యలపై పలు టీచర్ల యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్, లక్ష్మణ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, పీఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు వడ్నాల రవిరాజ్ తదిత రులు హరీశ్​రావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. టీచర్లపై హరీశ్​చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉద్యోగులు, టీచర్ల బలం నిరూపితమైన సంగతి హరీశ్ రావు మర్చి పోవద్దని, లోక్ సభ ఎన్నికల్లోనూ టీచర్లు తమ బలాన్ని చాటుతారని హెచ్చరించారు.

ఉద్యోగులను అవమానించిన హరీశ్​రావు

హరీశ్​రావు చేసిన కామెంట్స్​ను టీఎస్​యూటీఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవేణు ఖండించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్న ఉద్యోగులను హరీశ్​రావు అవమానించాడని మండిపడ్డారు. రైతు బంధుకు తాము వ్యతిరేకం కాదని, కానీ రైతులకు ఉద్యోగుల జీతాలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మెజారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కనీస వసతులు లేకున్నా క్షేత్రస్థాయిలో  పనిచేస్తున్న విషయాన్ని  గుర్తించాలన్నారు. గత ప్రభుత్వం ఇన్​టైమ్​లో జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిందన్నారు.