
కేసీఆర్ కంటే పెద్ద మోసగాడు కేటీఆర్:ఎంపీ కోమటిరెడ్డి
యాచారం: సీఎం కేసీఆర్ కంటే పెద్ద మోసగాడు కేటీఆర్ అని, ఫార్మాసిటీ లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 16 లక్షలు ఇస్తూ 35 లక్షలకు కొంటున్నట్లు చెబుతున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కి వ్యతిరేకంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ మరియు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఫార్మాసిటీ నిరసన సభ ను నిర్వహించారు. ఈ సభలో సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు కోదండ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, మాల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంచందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీకి ప్రత్యేక రైల్ లో వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ,అప్పుడు ఫార్మాసిటీ జీవోలను రద్దుచేస్తామని అన్నారు, ఈ ప్రభుత్వం తెస్తున్న ఎల్ ఆర్ఎస్ ను రద్దు చేసి అందరికీ ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూడెకరాల ఇస్తామని ప్రభుత్వం లోకి వచ్చి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన భూములను తీసుకుంటున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం , మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని అధికారం లోకి వచ్చి, అవేవీ అమలు చేయల్లేదన్నారు. కేసీఆర్ , టీఆర్ఎస్ రెండూ శాశ్వతం కాదని , మరల ఎన్నికలు వస్తాయని, మూడేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ని పూర్తిగా రద్దుచేస్తామని, ఎల్ ఆర్ యెస్ ద్వారా ఉచితంగా చేస్తామని అన్నారు. సహాయ నిరాకరణ చేసి స్వాతంత్ర్యం సాధించామని… ఎల్ ఆర్ యెస్ కట్టకుండా, ఫార్మాసిటీ కి భూములు ఇవ్వకుండా సహాయనిరాకరణ చేయాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ మనకు భూములు ఇస్తే, కేసీఆర్ గుంజుకోచూస్తున్నాడన్నారు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు ఫార్మాసిటీ కి వ్యతిరేకంగా వున్నారని, కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఫార్మాసిటీ కి అనుకూలంగా వున్నారని చెప్పారు. కేవలం టీఆర్ఎస్ నాయకులతో ప్రజాభిప్రాయ సేకరణ చేశారన్నారు .ఐక్యంగా ఫార్మాసిటీని అడ్డుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఫార్మాసీటీ లో భూములు కోల్పోతున్న వివిధ గ్రామాల రైతులు, ప్రజలు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.