ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద భూకుంభకోణం : కాంగ్రెస్ నేతలు

ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద భూకుంభకోణం : కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు, కోదండ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. పట్టా భూములు,  ఇందిరాగాంధీ పంచిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి 24 లక్షల కుటుంబాల భూములను పట్టా చేయలేదన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని పేర్కొన్నారు. ఇవాళ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని కాంగ్రెస్ నాయకులు కలిసి ధరణి పోర్టల్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ధరణి పోర్టల్ రికార్డును విదేశీ కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘నిషేధిత భూమిగా ఉన్న 600 ఎకరాలను మైహోం రామేశ్వరావుకి ఎలా కట్టబెడతారు. 600 ఎకరాల భూమి ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉంటే.. అప్పనంగా 2 లక్షల రూపాయలకే మై హోమ్ రామేశ్వరరావు కి కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను వేలం వెయ్యొద్దు... వేలకోట్ల రూపాయల కోకాపేట భూములను ఎలా వేలం వేస్తరు ?’’ అని కోదండ రెడ్డి ప్రశ్నించారు. 

‘‘ధరణి పోర్టల్ పూర్తిగా అవకతవకలతో ఉంది. రాష్ట్రంలోని ఒక్క గుంట భూమిని కూడా పోనివ్వమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారు. నైజాం నుంచి వచ్చిన భూములు కూడా కబ్జాల బారినపడ్డాయి. పేదల భూములు అక్రమంగా టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నరు’’ అని కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘త్వరలో నేను పాదయాత్ర చేస్తా. రేవంత్ రెడ్డి కూడా దానికి మద్దతు ఇవ్వాలి’’ అని కాంగ్రెస్ నేత హనుమంతరావు పేర్కొన్నారు.