కాంగ్రెస్ ​నేతలను బజారున పడేసిన హుజూరాబాద్​ రిజల్ట్

కాంగ్రెస్ ​నేతలను బజారున పడేసిన హుజూరాబాద్​ రిజల్ట్
  • ఢిల్లీలో కాంగ్రెస్​ కొట్లాట
  • హుజూరాబాద్​ ఓటమిపై నేతల మధ్య లొల్లి
  • రెండు గ్రూపులుగా చీలిన నేతలు
  • ఈటలను పార్టీలోకి పిలవకపోవడంపై రచ్చ
  • కొందరు టీఆర్​ఎస్ కోవర్టులని కంప్లైంట్లు 

హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: హుజూరాబాద్​ ఉప ఎన్నిక రిజల్ట్​ కాంగ్రెస్ ​నేతలను బజారున పడేసింది. పార్టీలో మరో సారి గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును రోడ్డుకీడ్చారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఈ రచ్చ శనివారం ఢిల్లీలో వార్​రూం భేటీలో మరింత బయటపడింది. రాష్ట్ర నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం విమర్శలు చేసుకున్నట్టు సమాచారం. ఈటలను పార్టీలోకి పిలవకపోడంపై కూడా వాడి వేడి చర్చ జరిగింది. కొందరు టీఆర్ఎస్​ కోవర్టులుగా పని చేస్తున్నారని కంప్లైంట్​ చేసినట్టు తెలిసింది.  హుజూరాబాద్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు వచ్చిన ఓట్లు ఘోర అవమానంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లొస్తే ఉప ఎన్నికలో 3 వేల ఓట్లే రావడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్ ​కూడా ఈ విషయంలో ఆశ్చర్యంలో ఉంది. దేశంలో మిగతా ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రాగా, తెలంగాణలో ఘోరంగా ఓడిపోవడం మింగుడు పడట్లేదు. బైపోల్​ రిజల్ట్స్​పై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందిస్తూ.. బల్మూరిని బలి చేశారని బహిరంగంగానే ఆరోపణ చేశారు. అభ్యర్థి ఎంపికపై రేవంత్, భట్టిని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్​ ఫలితాలపై కొద్ది రోజుల కిందట గాంధీభవన్​లో ముఖ్య నేతల భేటీ జరిగింది. ఫలితాలపై నేతలు చర్చించారు. 

గాంధీభవన్​లో పోస్టుమార్టం సక్కగ జరగలేదని..
గాంధీభవన్​ సమావేశంలో సరైన పోస్టుమార్టం జరగలేదని హైకమాండ్​ను నేతలు ఆశ్రయించారు. ఢిల్లీలో చర్చ జరగడం కరెక్టని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హైకమాండ్​కు లెటర్​ రాసి సమీక్ష జరపమన్నారు. ఆ ప్రకారం రాష్ట్ర నేతలను హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. భేటీకి పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​అధ్యక్షత వహించారు. ఉదయం 10.30కు సమావేశం ఏర్పాటు చేసి నేతలతో మాట్లాడి పంపించాలనుకున్నారు. రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో వాతావరణం హీటెక్కింది. దీంతో సాయంత్రం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి నాయకుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా హైకమాండ్​ అడిగి తెలుసుకుంది. భేటీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్​ నేతలు దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. 

రెండుగా చీలిన నేతలు 
ఢిల్లీలో వార్​రూంలో జరిగిన భేటీలో నేతలు రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. ఓటమికి మీదంటే మీదే బాధ్యతని పరస్పరం ఆరోపణ చేసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్​లో ఉండి కొందరు టీఆర్​ఎస్​కు సహకరిస్తున్నారని పొన్నం పరోక్షంగా ఉత్తమ్​ను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలిసింది. కౌశిక్​ రెడ్డిని ఆయనే టీఆర్​ఎస్​లోకి పంపినట్లు, ఎమ్మెల్సీ ఇప్పించినట్లు ఆరోపించారు. హుజూరాబాద్​, ఈటలను పార్టీలోకి తీసుకురావడానికి నేతలు ప్రయత్నం చేయలేదన్నారు. దీనిపై హైకమాండ్​కు లెటర్​  రాసినట్టు తెలిపారు.  హుజూరాబాద్​తోపాటు గతంలో జరిగిన దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్​ఎంసీ ఎన్నికల రిజల్ట్​పైనా సమీక్ష జరపాలని కోరినట్టు సమాచారం. తాను మాట్లాడేవి తప్పయితే పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని రియాక్ట్​ అయినట్లు తెలిసింది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలుచేశారు.

నేనున్నప్పుడు డిపాజిట్లన్నా దక్కాయి: ఉత్తమ్​
తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పార్టీకి కనీసం డిపాజిట్లు దక్కాయని, హుజూరాబాద్​లో ఘోరమైన ఫలితాలు వచ్చాయని ఉత్తమ్ ​అన్నట్లు తెలిసింది. రేవంత్​ వర్గం కుట్రపూరితంగానే తనను కార్నర్​ చేస్తున్నారని వాదించినట్లు సమాచారం. కౌశిక్​ రెడ్డి పార్టీలో ఉన్నపుడు 4 శాతం ఓట్లు పడతాయని పీసీసీ సర్వేలో తేలిందని, మరి అప్పటి నుంచి పరిస్థితి మెరుగు పర్చేందుకు ఎందుకు కృషి చేయలేదని అడిగినట్లు సమాచారం. కౌశిక్​ నిర్ణయం వ్యక్తిగతమైందని, దాన్ని అడ్డం పెట్టుకొని తనపై తప్పడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారానికి జనాలు బాగా వచ్చారు కదా అని వేణుగోపాల్ ప్రశ్నించగా మీటింగ్​లకు వచ్చారు కానీ ఓట్లేసేందుకు రాలేదని ఉత్తమ్​ జవాబిచ్చినట్లు తెలిసింది. 

బీజేపీకి బీ టీమ్​గా టీఆర్​ఎస్: ఠాగూర్​
బీజేపీకి టీఆర్​ఎస్​ బీ టీమ్​గా వ్యవహరిస్తోందని, ‘గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ’లా వాళ్ల మధ్య అవగాహన ఉందని మాణిక్కం ఠాగూర్​ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అనేక చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలకు టీఆర్​ఎస్​ మద్దతిస్తూనే వస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు అనుమానించారు. ఢిల్లీలో హైకమాండ్​ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఫలితాలపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్నారు.