పట్టభద్రులు టీఆర్ఎస్ మాయ మాటలు నమ్మవద్దు

పట్టభద్రులు టీఆర్ఎస్ మాయ మాటలు నమ్మవద్దు

హైదరాబాద్: నిరుద్యోగ సమస్యకు పరిస్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని అన్నారని…కానీ తెలంగాణనలో ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోతోందని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి విమర్శించారు. MLC ఎన్నికలపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి.. ఎన్నికల కోసం నిరుద్యోగ భృతి అన్నారని.. ఎన్నికలు అయిపోయాయి.. నిరుద్యోగ భృతి మర్చిపోయారన్నారు.  హైదరాబాద్‌లో ఉన్న పెద్ద సంస్థలు అన్ని కాంగ్రెస్ తెచ్చినవే అని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్ లేరని రామ్మోహన్‌రెడ్డి మండపడ్డారు.

సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…టీఆర్ఎస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తామన్నారని.. నాంపల్లిలోని గల్లీలలో నాలా నీళ్లు రోడ్లపై పారుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆసుపత్రులలో బెడ్లు లేవని..వర్షం పడితే కార్లు ఈతకోడుతున్నాయని వ్యాఖ్యానించారు. మనుషులు నాలాలో కొట్టుకుపోతున్నారన్నారు. ప్రతీ కాంగ్రెస్ సభ్యులు సిటీలో పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని కోరారు. ముస్లింల 12శాతం రిజర్వేషన్లు ఏమనయో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ వందల వాగ్దానాలు చేసింది కానీ…ఒక్కటి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ మాటలు గాలిలోనే ఉంటాయని.. గ్రౌండ్‌లో కనిపించదన్నారు. టీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో డబ్బుతోనే గెలిచిందని ఆరోపించారు. పట్టభద్రులు డబ్బుకు ఆశ పడొద్దని..ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ అంతా పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అంతా డబ్బా గవర్నమెంట్ అని వ్యాఖ్యానించారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలకు మాయ మాటలు చెప్పి, డబ్బుతో ఓట్లు కొనుగోలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. పట్టభద్రులు టీఆర్ఎస్ మాయ మాటలకు నమ్మవద్దని అన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం కాదు కదా..ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని కాంగ్రెస్ ఫీజు రీఎంబర్స్ మెంట్ తెచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే  టీఆర్ఎస్ కేజీ టూ పీజీ విద్య ఏమైందని ప్రశ్నించారు.