పల్లె ప్రచారంలో.. ఎంపీ, ఎమ్మెల్యేలు బిజీ

 పల్లె ప్రచారంలో.. ఎంపీ, ఎమ్మెల్యేలు బిజీ
  • కాంగ్రెస్​ మద్దతుదారుల గెలుపు కోసం ఊళ్లను చుట్టేస్తున్న ముఖ్య నేతలు

నాగర్​కర్నూల్, వెలుగు: పల్లె ప్రచారంలోకి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో బిజీగా మారారు. కాంగ్రెస్​ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచులను గెలిపించుకునేందుకు గ్రామాలను చుట్టేస్తున్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో మొదటి, రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, కులస్తులు, బంధువులతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న దగ్గరి బంధువులను ప్రచారానికి పిలిపించుకుంటున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేల ప్రచారం..

నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్​ అభ్యర్థుల గెలుపు కోసం ఉదయం, సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీ మల్లు రవి తెల్కపల్లి మండల కేంద్రం, తాడూరు మండలం పొల్మూరు, గుట్టలపల్లి, మేడిపూర్​లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్  బలపర్చిన వారిని గెలిపిస్తే గ్రామాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు ఇస్తుందని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, తాను అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని భరోసా ఇస్తూ ఓట్లు వేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​ కార్యకర్తలు డప్పులు కొడుతూ చిందులేస్తుంటే, ఉత్సాహంతో ఎంపీ డప్పు తీసుకొని దరువేస్తూ, డ్యాన్స్​ చేస్తున్న కార్యకర్తలను ఆలింగనం చేసుకుంటూ జోష్​ నింపారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఒక్కో రోజు రెండు మండలాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా చేపడుతున్న ర్యాలీల్లో మహిళలు ఉత్సాహంగా
 పాల్గొంటున్నారు.

పోటాపోటీ ప్రచారం..

మొదటి విడతలో కల్వకుర్తి, వెల్డండ, వంగూరు, ఊర్కొండ, తాడూరు, తెల్కపల్లి మండలాల్లోని 151 గ్రామ పంచాయతీలు, రెండవ విడతలో బిజినేపల్లి, కోడేరు, నాగర్​ కర్నూల్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజీపేట మండలాల్లో 151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, ఏకగ్రీవమైన జీపీలు మినహా మిగిలిన చోట్ల పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో హంగులు, ఆర్భాటాలకు లోటు లేకుండా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో డిజిటల్​ స్క్రీన్​ ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు ప్రకటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కొల్లాపూర్​పై మంత్రి ఫోకస్..

రెండవ విడత పోరులో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్​ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఉన్నాయి. మంత్రి ప్రధాన అనుచరులు ఎన్నికల బరిలో ఉండగా, సెకండ్​ క్యాడర్​కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. రోజువారీగా ప్రచారం, ఇతరత్రా అంశాలను సమీక్షిస్తూ క్యాడర్​కు దిశానిర్దేశం చేస్తున్నారు. 

ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​ రెడ్డి ప్రతి పంచాయతీలో తన అనుచరులను పోటీలో నిలిపారు. నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఒక వైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి మరో వైపు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తమ అనుచరులను గెలిపించుకునేందుకు ప్రచారం చేస్తున్నారు.