వానాకాలం వచ్చింది.. హైదరాబాదీల బాధలు పట్టించుకోండి.. జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ వినతి

వానాకాలం వచ్చింది.. హైదరాబాదీల బాధలు పట్టించుకోండి.. జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ వినతి

వర్షాకాలం సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కలిశారు. ప్రజల నుంచి కోట్ల రూపాయలను ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తోందని కానీ.. వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలంలో ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కాలం గడిపే పరిస్థితి నెలకొందని చెప్పారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు భద్రత కల్పించాలని..వార్షాకాలమంతా జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా జీహెచ్ఎంసీ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎస్ ఎన్ డీపీ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. వర్షాకాలం ఇబ్బందులపై స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజయారెడ్డి కోరారు.