మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను  అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను  అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

జవహర్ నగర్, వెలుగు:  ‘‘ఏంరా.. ఒర్రుతున్నరు. మీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు”అంటూ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలను తిట్టారు. జవహర్ నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి..  కాంగ్రెస్​ నాయకులపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలంతా రోజూ పబ్లిక్ లో ఉండాలని, ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కొన్ని రోజుల కిందట సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మేడ్చల్​ జిల్లా లో మంత్రి మల్లారెడ్డి ఆదివారం జవహర్​ నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​లోని గబ్బిలాలపేట్​లో పాదయాత్ర చేపట్టారు. విషయం తెలుసుకున్న  కాంగ్రెస్​ పార్టీ నాయకులు మంత్రిని అడ్డుకున్నారు. ఎన్నికల​సమయంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి జవహర్​ నగర్​ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశారంటూ నిలదీశారు.

దీంతో టీఆర్ఎస్​ నాయకులు, కాంగ్రెస్​ నేతల మధ్య కాసేపు తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్​ నాయకులను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంతో ఆవేశానికి లోనైన మంత్రి మల్లారెడ్డి.. ‘‘మీ రేవంత్​ రెడ్డి ఏం చేసిండు” అని విరుచుకుపడ్డారు. తర్వాత కాంగ్రెస్​ నేతలు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్​ నాయకులకు జవహర్​ నగర్​ ప్రజల సమస్యలు పరిష్కరించాలనుంటే ఎన్నికల ముందు 58, 59 జీవో కింద పేద ప్రజలకు పట్టాలు ఇస్తామన్న నిలబెట్టుకోవాలని  డిమాండ్ చేశారు. కార్పొరేషన్​ పరిధిలో ఉన్న సుమారు ఆరువేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడానికే మంత్రి మల్లారెడ్డి,  మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్​లు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు.

కార్పొరేషన్​ పరిధిలో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా భూ ఆక్రమణలే తమ ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. జవహర్​ నగర్​ కార్పొరేషన్ తన గుండెకాయ అని ఎక్కడపడితే అక్కడ మాట్లాడే మల్లారెడ్డి.. జవహర్​ నగర్​లో తిరగడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని, కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ వెంచర్లను, నిర్మాణాలను అడ్డుకొని ప్రభుత్వ భూములు కాపాడాలన్నారు.