
2024సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఓడించడం తథ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాలాండ్ ఎన్నికల సభలో పాల్గొన్న ఖర్గే....2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షకూటమి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వంద మంది మోడీలు, షాలు వచ్చినా.... తామే అధికారం చేపడతామని, దాన్ని ఎవరూ ఆపలేరని ఖర్గే నొక్కి చెప్పారు. మీరు ఆటోక్రాట్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మీరేం నియంత కాదన్న ఖర్గే.. ప్రజలే మీకు తగిన పాఠం చెబుతారన్నారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయలేదని చెప్పారు. అలా స్వాతంత్ర్య కోసం పోరాడి ఉరి శిక్షకు బలైన వారు, జైలు శిక్ష అనుభవించిన వారు బీజేపీలో ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను ఇచ్చారన్నారు.