పార్టీ పదవుల్లో బలహీన వర్గాలకు సగం పదవులు

పార్టీ పదవుల్లో బలహీన వర్గాలకు సగం పదవులు

ఉదయ్ పూర్ (రాజస్థాన్): పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ నేతలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి గ్యారంటీ ఇవ్వడం కోసం చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. రైతులను రుణ విముక్తులను చేయడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో శనివారం కాంగ్రెస్ ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ రెండో రోజు సమావేశాల్లో పలు ప్రతిపాదనలను ఆమోదించినట్లు పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వెల్లడించారు. చింతన్ శిబిర్​లో ‘వ్యవసాయం, రైతులు’ అంశంపై ఏర్పాటైన గ్రూప్​కు కన్వీనర్​గా వ్యవహరించిన ఆయన పార్టీ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కేంద్రం అగ్రి చట్టాలను మళ్లీ తెస్తే అడ్డుకుంటామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన సీ2 ఫార్ములా ప్రకారం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు ‘నేషనల్ ఫార్మ్ డెట్ రిలీఫ్ కమిషన్’ ఏర్పాటు అంశం కూడా పార్టీలో చర్చకు వచ్చిందన్నారు.  

పార్టీలో సామాజిక న్యాయం

పార్టీ చీఫ్ సోనియా గాంధీ నియమించిన ‘సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్’ కమిటీ సిఫారసు మేరకు పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత కె. రాజు తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలపనుందని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఒక పాలసీని తేవాలని ప్రతిపాదించిందన్నారు.  

పార్టీని ప్రియాంకకు అప్పగించాలె

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవిని ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని పార్టీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ డిమాండ్ చేశారు. ప్రియాంక చాలా పాపులర్ లీడర్ అని, ప్రెసిడెంట్ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోకపోతే ప్రియాంకకే చాన్స్ ఇవ్వాలన్నారు. దీనిపై పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వెంటనే ఆయనను వారించారు. ప్రియాంకకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఎంపీ దీపేందర్ హుడా కూడా కోరారు.

కాంగ్రెస్ కు సునీల్ జాఖడ్ గుడ్ బై 

పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ కాంగ్రెస్​కు గుడ్ బై చెప్పారు. ‘కాంగ్రెస్​కు గుడ్ బై. గుడ్ లక్’ అంటూ శనివారం ఆయన ఫేస్​బుక్​ లైవ్​లో ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీయే బాధ్యుడని చెప్పడంతో ఇటీవల ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీంతో జాఖడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ స్థానంలో కొత్తగా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న పార్టీ అసమ్మతి నేతల కీలక డిమాండ్ కు కూడా చింతన్ శిబిర్ లో పార్టీ ఓకే చెప్పింది. ఈ ప్రతిపాదనకు కూడా ఆదివారం సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది.