ఆర్మీలో ఖాళీలను భర్తీ చేసే టైంలేదా?: ఖర్గే

ఆర్మీలో ఖాళీలను భర్తీ చేసే టైంలేదా?: ఖర్గే
  • మోదీ సర్కార్ పై కాంగ్రెస్ చీఫ్​ విమర్శలు

న్యూఢిల్లీ: ఆర్మీలో కీలకమైన అధికారుల పోస్టుల కొరత విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి మోదీ ప్రభుత్వానికి చాలా సమయం ఉంది. కానీ సాయుధ దళాలలో ముఖ్యమైన మేజర్, కెప్టెన్​  స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రం టైమ్​ లేదు. జాతీయవాదం అని రోజూ ఊదరగొట్టే వారు మన ఆర్మ్​డ్ ఫోర్సెస్​కు మరెవరూ చేయనంత ద్రోహం చేశారు" అని ఖర్గే సోమవారం ట్వీట్​ చేశారు. 

ఆ ట్వీట్​కు ఆర్మీలో మేజర్, కెప్టెన్​  స్థాయి అధికారుల కొరతపై ఓ మీడియాలో ప్రచురితమైన రిపోర్ట్​ను యాడ్​ చేశారు. ప్రస్తుతం కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఖర్గే పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వద్ద దేశ సైనికులకు కావాల్సిన నిధులు లేవని అగ్నిపథ్ స్కీమ్​ స్పష్టంగా  తెలియజేస్తున్నది అన్నారు. వన్​ర్యాంక్ ​వన్ ​పెన్షన్​(ఓఆర్​ఓపీ) అమలులో మోదీ ప్రభుత్వం డిఫెన్స్​ కమ్యూనిటీకి ద్రోహం చేసిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి జాతీయ భద్రత జాతీయ ప్రాధాన్యత కాదని, ప్రజల ఆదేశాలకు ద్రోహం చేయడం మాత్రమే వారి ప్రాధాన్యత’’ అని ఖర్గే ఆరోపించారు.