
పద్మారావునగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలను సనత్‌నగర్ సెగ్మెంట్లోని ప్రతి గడపకు చేరవేస్తామని పీసీసీ మెంబర్, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ మర్రి ఆదిత్య రెడ్డి తెలిపారు. శుక్రవారం సనత్‌నగర్, బన్సీలాల్ పేట, బేగంపేట, అమీర్‌పేట, రాంగోపాల్‌పేట డివిజన్లలో గడప గడపకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు.
5 డివిజన్లలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆదిత్య రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా పలువురు యువకులు, స్థానిక ప్రజలు 'ఐ సపోర్ట్ మర్రి ఆదిత్యరెడ్డి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.