- ఇండియా కూటమి మేనిఫెస్టో.. ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉంది
- బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు: మోదీ
- ఆర్టికల్ 370పై ఖర్గే కామెంట్లను ఖండిస్తున్నం
- జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా?
- సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా?
- బిహార్, బెంగాల్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని ఫైర్
నవాడ(బిహార్): ఆర్టికల్ 370తో రాజస్థాన్‌కు ఏం సంబంధమంటూ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఓ జాతీయ పార్టీకి చీఫ్‌గా ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఖర్గే పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. ఇదీ ‘తుక్డే.. తుక్డే’ గ్యాంగ్ మనస్తత్వం అంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ గ్యాంగ్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా? అని నిలదీశారు. ‘‘రాజస్థాన్, బిహార్‌కు చెందిన యువకులు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడుల్లో అమరులవుతున్నారు. జాతీయ జెండాతో చుట్టిన శవ పేటికల్లో మళ్లీ రాష్ట్రాలకు వస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా? ఇదీ ‘తుక్డే.. తుక్డే..’ గ్యాంగ్ మనస్తత్వం. కాంగ్రెస్‌కు నేషనల్ ప్రెసిడెంట్ అనేది చిన్న పోస్టు కాదు.. ఆయన చేసిన కామెంట్లు రాజస్థాన్, బిహార్ అమరులను అవమానించేలా ఉన్నాయి. రాజ్యాంగం గురించి ఇండియా కూటమి నేతలు మాట్లాడుతున్నరు.. మరి జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి’’ అని నిలదీశారు. నవాడ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్, ఆర్జేడీ కలిస్తే జంగిల్ రాజ్
ఇండియా కూటమి మేనిఫెస్టో.. ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరి ఉందని మోదీ విమర్శించారు. జాతీయ సమగ్రత, సనాతన ధర్మం పట్ల వ్యతిరేకత పెంచేలా ఉన్నదన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే మేనిఫెస్టోను రూపొందించినట్టు స్పష్టమవుతున్నదని విమర్శించారు. ‘‘కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి అధికారంలో ఉన్నప్పుడు బిహార్‌లో జంగిల్ రాజ్ నడిచింది. సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కర్నాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే సురేశ్ కోరాడు. ఈ తుక్డే.. తుక్డే గ్యాంగ్.. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నది. ఇలాంటి కామెంట్లతోనే వాళ్ల మైండ్‌సెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానించినా కాంగ్రెస్ నుంచి ఎవరూ రాలేదు’’ అని గుర్తుచేశారు. రామ మందిరం గురించి పాజిటివ్‌గా మాట్లాడిన వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. త్రిపుల్ తలాక్‌తో ఎంతోమంది ముస్లిం మహిళల జీవితాల్లో సంతోషాలు తీసుకొచ్చామని మోదీ తెలిపారు.
అవినీతిపరులను టీఎంసీ రక్షిస్తున్నది
బెంగాల్ ప్రభుత్వం అవినీతిపరులను రక్షిస్తున్నదని మోదీ ఆరోపించారు. అవినీతి, హింసకు టీఎంసీ సర్కార్ ఫ్రీగా లైసెన్స్ కోరుకుంటున్నదని ఫైర్ అయ్యారు. సెంట్రల్ ఏజెన్సీ బృందాలు ఇన్వెస్టిగేషన్ కోసం రాష్ట్రానికి వస్తే టీఎంసీ లీడర్లు వాళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్లో సిండికేట్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. జల్పాయిగురిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘‘అవినీతిపరులను కాపాడేంత ఇంట్రెస్ట్.. రాష్ట్ర అభివృద్ధిపై లేదు. 2022, మేద్నిపూర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ అధికారులు వెళ్తే టీఎంసీ నేతలు దాడి చేశారు. సందేశ్‌ఖాలీ కేసులో సోదాలు చేసేందుకు ఈడీ అధికారులు నార్త్ 24 పరగణలో ని టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంటికెళ్తే గుంపుగా దాడి చేశారు. చట్టం, రాజ్యాంగాన్ని టీఎంసీ విస్మరిస్తున్నది’’అని మోదీ ఫైర్ అయ్యారు.
గెలుస్తామంటూనే ప్రచారం ఎందుకు?: తేజస్వీ
బంపర్ మెజార్టీతో గెలుస్తామని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారని, అలాంటప్పుడు ఎందుకు ప్రచారానికి వెళ్తున్నారని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. అపోజిషన్ పార్టీలు సనాతన ధర్మానికి విరుద్ధమంటూ మోదీ ప్రచారం చేయడం సరికాదన్నారు. మోదీకి ఓటమి భయం పట్టుకున్నదన్నారు.
మోదీకి లాంగ్ లీవ్: కాంగ్రెస్
ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకోవడానికే మోదీ కాంగ్రెస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘‘ప్రధాని చెప్పే అబద్ధాలు విని ప్రజలంతా విసిగిపోయారు. జూన్ 4 తర్వాత ఆయన్ను ప్రజలంతా కలిసి లాంగ్ లీవ్‌కు పంపిస్తారు. ఇది దేశ ప్రజల హామీ.. పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు. అందుకే మేము పాంచ్ న్యాయ్.. పచ్చిస్ గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశాం. బీజేపీ బాధితుల గొంతుకే
మా మేనిఫెస్టో’’అని జైరాం రమేశ్ అన్నారు.