- యువత, రైతులు, మహిళలు, కార్మికులు,
- అణగారిన వర్గాలకు 5 చొప్పున మొత్తం 25 గ్యారంటీలు
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తామని, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి లీగల్ గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది. మహాలక్ష్మి స్కీం కింద ప్రతి పేద కుటుంబంలోని పెద్ద వయసు మహిళకు ఏటా ఎలాంటి షరతులు లేకుండా రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
మేనిఫెస్టోలో ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ’ అంశానికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపింది. ఇందులో భాగంగా యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల కోసం ఒక్కో వర్గానికి 5 గ్యారంటీల చొప్పున మొత్తం 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో చేర్చింది. గత పదేండ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గిస్తామని పేర్కొంది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి. చిదంబరం, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ‘న్యాయ పత్రం’ పేరిట రూపొందించిన ఈ 48 పేజీల మేనిఫెస్టోలో ఖర్గే, రాహుల్ గాంధీ, భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించిన ఫొటోలను ముద్రించారు.
దేశవ్యాప్తంగా కులగణన..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
కులాలు, ఉపకులాల వారీగా జనాభాను లెక్కించి, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను గుర్తిస్తామని తెలిపింది. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) పక్కాగా అమలు అయ్యేలా చూస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందుకోసం ఎంఎస్‌పీకి పర్మనెంట్ లీగల్ గ్యారంటీ ఉండేలా చూస్తామని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారమే ప్రతి సంవత్సరం ఎంఎస్‌పీ ఫార్ములాను రూపొందిస్తామని పేర్కొంది.
ఈడబ్ల్యూఎస్ లో అన్ని కులాలకూ కోటా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతానికి మించరాదని రాజ్యాంగంలో ఉన్నందున, రాజ్యాంగాన్ని సవరించి ఆ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికోసం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలో ఎలాంటి కుల, మత వివక్ష లేకుండా అన్ని కులాలు, కమ్యూనిటీ వాళ్లకూ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం కోటా కల్పిస్తామని పేర్కొంది. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రుణ భారంతో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఒకేసారి విద్యారుణాలను, పెండింగ్ లో ఉన్న వడ్డీని కూడా రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మార్చి 15వ తేదీని కటాఫ్ గా తీసుకుని దీనిని వర్తింపచేస్తామని తెలిపింది. రద్దు చేసే విద్యారుణాల మొత్తాలను బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.
25 లక్షల ఆరోగ్య బీమా..
తాము అధికారంలోకి వస్తే దేశమంతటా ప్రభుత్వ దవాఖాన్లలో యూనివర్సల్ హెల్త్ కేర్ స్కీంను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. టెస్టులు, ఆపరేషన్లు, మందులతో సహా అన్ని వైద్యసేవలు ఉచితంగా అందజేస్తామని తెలిపింది. రాజస్థాన్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినట్టుగా నగదు రహితంగా రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను అందజేస్తామని తెలిపింది. ఈ స్కీంను పెద్ద దవాఖాన్లతోపాటు పీహెచ్ సీలు, ఎంహెచ్ సీలు, హెల్త్ క్యాంపుల ద్వారా కూడా అమలు చేస్తామని పేర్కొంది.
రాజ్యాంగానికి, చట్టాలకు సవరణ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జమ్మూకాశ్మీర్, పుదుచ్చేరి యూటీలకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తామని, లడఖ్ లోని గిరిజన ప్రాంతాల హక్కుల కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ను సవరిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మంత్రి మండలి సలహాలతో సహాయకారిగా మాత్రమే ఉండేలా చట్ట సవరణ చేస్తామని తెలిపింది. ప్రైవసీ హక్కులో జోక్యం చేసుకునే అన్ని చట్టాల్లోనూ తగిన సవరణలు చేపడతామని స్పష్టం చేసింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రతిపాదనను రద్దు చేసి.. రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది.
క్రిమినల్ చట్టాల్లో బెయిల్ కు సంబంధించి కొత్త చట్టం తెస్తామని ప్రకటించింది. గత పదేండ్లలో పార్లమెంటరీ స్క్రూటినీ, చర్చ లేకుండా ఎన్డీఏ సర్కారు అనేక చట్టాలను పాస్ చేసిందని, వాటన్నినీ సమీక్షించి, అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. జైళ్లో సమగ్ర సంస్కరణలకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల సమర్థత, బ్యాలెట్ పేపర్ల పారదర్శకత కోసం ఎన్నికల చట్టాలను సవరిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ‘ఓటింగ్ ఈవీఎంల ద్వారానే జరుగుతుంది. కానీ ఓటేసిన తర్వాత మెషీన్ నుంచి జనరేట్ అయ్యే ఓటింగ్ స్లిప్ లను వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యూనిట్ లలో జమ చేసేందుకు అవకాశం కల్పిస్తాం’ అని ఆ పార్టీ తెలిపింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ చట్టాల స్థానంలో కొత్తగా జీఎస్టీ 2.0 చట్టాన్ని తెస్తామని ప్రకటించింది. డైరెక్ట్ ట్యాక్సెస్ లో పారదర్శకత కోసం డైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్ ను తీసుకొస్తామని పేర్కొంది.
ఉపాధి హామీ కూలీ రూ. 400కు పెంపు
లోక్ సభ ఎన్నికల్లో తాము గెలిస్తే ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ రూ. 400కు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తులు, క్లాస్ రూంలు, లైబ్రరీలు, పీహెచ్ సీల నిర్మాణంలోనూ ఉపాధి హామీ కూలీలను వినియోగించుకుంటామని తెలిపింది. పట్టణాల్లోనూ ఉపాధి హామీ తరహా కార్యక్రమం అమలు చేస్తామని, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టికి ఈ పథకాన్ని వాడుకుంటామని పేర్కొంది.
స్కాంలపై దర్యాప్తు..
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎలక్టోరల్ బాండ్స్, పీఎం కేర్స్, రఫేల్, పెగాసస్ స్పైవేర్, డీమానిటైజేషన్ కుంభకోణాలు జరిగాయని, తాము అధికారంలోకి వస్తే వీటిపై సమగ్ర విచారణ చేయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ పైనా పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని తెలిపింది. హేట్ క్రైమ్స్, బుల్డోజింగ్ జస్టిస్ వంటి వాటికి చెక్ పెడతామని పేర్కొంది.
మేనిఫెస్టోలోని ఇతర కీలక అంశాలివే..
దివ్యాంగులకు ‘అసిస్టెడ్ లివింగ్ అండ్ కేర్ సెంటర్స్’ ఏర్పాటు చేస్తామని, స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ దంపతుల సివిల్ యూనియన్లను గుర్తించేందుకు చట్టం తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎకనమిక్ పాలసీని కూడా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా ‘నవ సంకల్ప్ ఎకనమిక్ పాలసీ’ని తెస్తామని తెలిపింది. ఇందులో ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం ఇస్తామంది.
ఛాతీ చరుచుకుంటే భద్రత రాదు..
దేశ భద్రత అనేది ఛాతీ చరుచుకుంటే లేదా అతిశయోక్తులు చెప్పుకుంటే పెరగదని.. బార్డర్లపై దృష్టి పెట్టి, రక్షణ వ్యవస్థను పటిష్టంగా సన్నద్ధపరిస్తేనే దేశ భద్రత పెరుగుతుందని కాంగ్రెస్ కామెంట్ చేసింది. ఆ పార్టీ ఈ మేరకు తన మేనిఫెస్టోలో ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే చైనాతో సరిహద్దుల్లో స్టేటస్ కో (యథాతథ స్థితి)ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. గతంలో రెండు దేశాల జవాన్లు గస్తీ కాసిన ప్రాంతాల్లో మళ్లీ మన జవాన్లు గస్తీ కాసేలా చూస్తామని పేర్కొంది. అలాగే మాల్దీవ్స్ తో దెబ్బతిన్న దౌత్యపరమైన సంబంధాలను కూడా పునరుద్ధిరిస్తామని తెలిపింది.
మహిళలకు ఏటా రూ. లక్ష సాయం..
దేశంలోని 23 కోట్ల మంది పేదల సంపద పెంచడంలో భాగంగా మహాలక్ష్మి స్కీంను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ స్కీం కింద ప్రతి పేద కుటుంబలోని పెద్ద మహిళకు బేషరతుగా ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఇన్ కం పిరమిడ్ లో అట్టడుగున ఉన్న వర్గాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ స్కీంతో ఆర్థిక అసమానతలను తగ్గిస్తామని వివరించింది.
కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% కోటా
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా కల్పిస్తామని ప్రకటించింది. ఎన్డీఏ సర్కారు తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సమీక్షిస్తామని తెలిపింది. ప్రతి డిప్లమా హోల్డర్ కు లేదా 25 ఏండ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్లకు ఏడాది పాటు అప్రెంటీస్ షిప్ హక్కు కల్పిస్తామని, అప్రెంటీస్ షిప్ పొందిన వారికి ఏడాదికి రూ. లక్ష సాయం అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం ‘రైట్ టు అప్రెంటీస్ షిప్ యాక్ట్’ను తెస్తామని ప్రకటించింది. అగ్నిపథ్ స్కీం రద్దు చేస్తామని, పాత పద్ధతిలోనే సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్లు చేపడతామని వివరించింది.
ఇదే మా ‘న్యాయ పత్రం’
కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ రాజకీయ చరిత్రలోనే ‘న్యాయ్ కా దస్తావేజ్(న్యాయ పత్రం)’గా నిలుస్తుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలోని ఐదు మూలస్తంభాలైన యువ (యువత), కిసాన్ (రైతులు), నారీ (మహిళలు), శ్రామిక్ (కార్మికులు), హిస్సేదారీ (అణగారిన వర్గాలు) వర్గాల కోసం 5 చొప్పున మొత్తం 25 గ్యారంటీలను ప్రకటించాం. మా మేనిఫెస్టోలో దేశ ‘షాన్ దార్ తస్వీర్ (అందమైన ముఖచిత్రం)’ ఉంది.
-
మల్లికార్జున ఖర్గే
మేం తప్పకుండా గెలుస్తం
దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న శక్తులకు, వాటిని కాపాడాలనుకుంటున్న శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు. మీడియాలో వస్తున్న కథనాల కంటే ఈ ఎన్నికల్లో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇప్పుడు ఇండియా ఏం కోరుకుంటోందో అదే మా మేనిఫెస్టోలో చేర్చాం. మేం తప్పకుండా గెలుస్తాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ప్రధాని పదవిని ఎవరు చేపట్టాలన్నది నిర్ణయిస్తాం
-
రాహుల్ గాంధీ
23 కోట్ల మంది పేదరికాన్ని నిర్మూలిస్తం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చే పదేండ్లలో దేశవ్యాప్తంగా 23 కోట్ల మంది సంపదను పెంచి, వారిని పేదరికం నుంచి బయటపడేస్తాం. బీజేపీ ప్రభుత్వం ‘ధనికుల యొక్క, ధనికుల చేత, ధనికుల కోసం’ అన్నట్టుగా పని చేస్తోంది. మేం అట్టడుగున ఉన్న 50 శాతం మంది అభివృద్ధి కోసం పని చేస్తాం.
-
పి. చిదంబరం