సర్వేపై జిల్లాల్లో కాంగ్రెస్ సమావేశాలు

సర్వేపై జిల్లాల్లో కాంగ్రెస్ సమావేశాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరుకావాలి : మహేశ్ గౌడ్
  • త్వరలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో మరో కీలక భేటీ
  • 5న రాష్ట్రానికి రాహుల్ వచ్చే చాన్స్ ఉందన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుల గణనకు పార్టీ తరఫున సహకారం అందించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు గ్రామం నుంచి మొదలు రాష్ట్రస్థాయి నేతలు, పార్టీ కార్యకర్తలు తమ వంతు పాత్రను పోషించాలని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం (ఇయ్యాల) అన్ని జిల్లాల్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు విధిగా హజరుకావాలని పీసీసీ చీఫ్ పార్టీ నేతలను ఆదేశించారు.

కుల గణనపై ఇది పార్టీ నేతలకు ఒక అవగాహన మీటింగ్ అని, దీన్ని ఆషామాషీ సమావేశంగా ఎంతమాత్రం తీసుకోరాదని కోరారు. ప్రతి ఒక్క పార్టీ నేత అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా గుర్తించి ఇందులో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనపై ప్రతి ఇంట్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని కోరారు. ఇది ప్రభుత్వం చేపడుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం అని, దీన్ని పార్టీ క్యాడర్ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు పార్టీకి మేలు కలుగుతుందని కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ శుక్రవారం ఫోన్ లో దిశానిర్దేశం చేశారు.

ఈ ప్రోగ్రామ్ తో బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక ఆదేశం మేరకు, వారు ఇచ్చిన మాటను నెరవేర్చడంలో భాగంగా దేశంలోనే తెలంగాణలో మొదటిసారిగా అమలు చేస్తున్న విషయాన్ని పార్టీ క్యాడర్ జనానికి వివరించాలని సూచించారు.

రాహుల్​ రాకపై సాయంత్రానికి క్లారిటీ

సగమ్ర సర్వేపై త్వరలోనే రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లతో మరో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు మహేశ్ గౌడ్ చెప్పారు. దీనికి సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ముఖ్య నేతలంతా హాజరవుతారన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ ఈ నెల 5 న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని, అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీ షెడ్యూల్ కనుక ఉంటే ఆ రెండు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసిన తర్వాతే రాష్ట్రానికి రానున్నట్లు పీసీసీ చీఫ్ చెప్పారు. కుల గణనపై మీటింగ్ కు మాత్రం రాష్ట్రానికి రాహుల్ రావడం ఖాయమని, ఏ తేదీన అనేది శనివారం సాయంత్రానికి స్పష్టత రానుందని మహేశ్ గౌడ్ చెప్పారు.