కార్మికులను పోలీసులతో కొట్టించిన రౌడీ కేసీఆర్ : భట్టి

కార్మికులను పోలీసులతో కొట్టించిన రౌడీ కేసీఆర్ : భట్టి

ఖమ్మం: రేపు ఖమ్మం జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఈ నెల 19 న తలపెట్టిన తెలంగాణ బంద్ కు కూడా తమ పార్టీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు తమ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోట్లాది ప్రజలు సాధించి తెచ్చుకున్న తెలంగాణలో బలిదానాలు బాధాకరమన్నారు భట్టి. ఆర్టీసీ ని ప్రైవేటీకరణ కోసమే ఈ కుట్ర జరుగుతుందని అన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడున్న ఉద్యోగాలను కూడా తీసివేస్తా అనడం అహంకారమేనని అన్నారు. ప్రజల ఆస్తిని ఎవరికో ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని, అందుకు ఎంతకైనా పోరాడతామని భట్టి అన్నారు. ఆర్ టి సి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

“కార్మికులను, ఉద్యోగులను కుక్క తోకతో, రౌడీలతో పోల్చినవ్, అసలు రౌడీలు మీరు. పోలీసులతో కార్మికులను దొంగతనంగా కొట్టించినవ్. ఇది ప్రజా స్వామ్యమా..?” అని భట్టి ప్రశ్నించారు. “నువ్వొక నియంత లాగా, ప్రజలు నీకు బానిసలుగా చేస్తున్నావ్. ఖబడ్దార్ కేసీఆర్..”  అంటూ భట్టి హెచ్చరించారు.

మఫ్టీలో వచ్చి కార్మికులను అక్రమంగా కొట్టిన సిఐ రమాకాంత్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలన్నారు. లాఠీలతో ముందుకు వస్తే ప్రజలు మీకు బుద్ధిచెప్పే రోజు ఉంటుందని, దుష్ట శక్తుల తో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తారా..? అని భట్టి అన్నారు.

వెంటనే బేషరత్ క్షమాపణలు చెప్పి ఆర్ టి సి ఉద్యోగులు అందరిని విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుండే ప్రారంభమైంది, మళ్ళీ ఆర్ టి సి ఉద్యమం కూడా ఖమ్మం నుండి కొనసాగుతుందని భట్టి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Congress MLA Bhatti vikramarka fire on CM KCR on RTC Issue