కేసీఆర్​ తెలంగాణ సెంటిమెంట్​ రెచ్చగొడుతుండు: జగ్గారెడ్డి

కేసీఆర్​ తెలంగాణ సెంటిమెంట్​ రెచ్చగొడుతుండు: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రం వచ్చి పదేండ్లయితున్నా ఇంకా తెలంగాణ సెంటిమెంట్​ను వాడుకునేందుకు కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్​ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ వాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​పార్టీలో సీఎం అభ్యర్థి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, సోనియా, రాహుల్, ఖర్గే అందరి అభిప్రాయాలు తీసుకుని సీఎం క్యాండిడేట్​ను డిసైడ్​ చేస్తారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్​లో బీఫామ్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​పార్టీకి 70 సీట్లు పక్కా వస్తాయన్నారు. 

15వ తేదీ తర్వాత పార్టీ స్పీడును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తమ మెయిన్​టీమ్​రాష్ట్రమంతటా యాక్టివ్​ అయిందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్​కు భయం పట్టుకుందని విమర్శించారు. కర్నాటక ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్​ మిస్​గైడ్​ చేస్తున్నదని, అబద్ధాలు చెప్పి కేసీఆర్​బయటపడాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్​ మొత్తం ఒక ఆవారా పార్టీగా మారిందని మండిపడ్డారు. హరీశ్​రావుకు నిద్ర తక్కువై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తానని పేర్కొన్నారు. పటిష్టమైన 50 డ్యాములు కట్టిన కాంగ్రెస్​ఎక్కడ.. ఒక్క డ్యామ్​కే సినిమా చూపిస్తున్న బీఆర్ఎస్​ ఎక్కడ అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్​ వస్తుందనగా ఎన్నెన్నో హామీలు ఇచ్చారని, వాటికి సంబంధించి ఒక్క జీవో కూడా రాలేదని విమర్శించారు. 

అమరుల కుటుంబాలకు అన్నం పెట్టారా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కుటుంబ సభ్యులను ప్రగతి భవన్​కు పిలిచి ఒక్కపూటైనా అన్నం పెట్టారా అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కొందరు అమాయకులను చంపి వాళ్ల చేతుల్లో చిట్టీలు పెట్టినోళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారని, చివరకు వారి కుటుంబాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​ నేతలు యూనివర్సిటీలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ప్రశ్నించారు. కవిత జైలుకు వెళ్తుందని బండి సంజయ్​ రోజూ చెప్పారని, ఆమె అరెస్ట్​ ఆగిపోగానే బీజేపీ పని ఖతం అయిందని విమర్శించారు. ఆ విషయంలో సంజయ్​ నోరు విప్పినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. ముస్లింలకు ఒవైసీ బ్రదర్స్​ ఏం చేశారో చెప్పాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సీఎం ఎవరుంటే వాళ్లను గొప్ప సీఎం అని పొగడటం తప్ప ఒవైసీలకు ఏమీ రాదని ఎద్దేవా చేశారు.