
వెలుగు : టీఆర్‌ఎస్ చేరబోతున్నట్టు ప్రకటించిన ఇల్లందు ఎంఎల్ ఏ బానోత్ హరిప్రియ గులాబీ అభ్యర్థి కవితను గెలిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. తాను గెలిచిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే. అధికారికంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరకుండానే ప్రచారంలో పాల్గొనడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇల్లెందు నుంచి గెలిచిన హరిప్రియ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ చేరుతున్నట్టు నెల రోజుల కిందట ప్రకటించారు. మహబూబాబాద్ జరిగిన ఎన్నికల సన్నాహక సభలో కేసీఆర్ సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్ తీర్థం తీసుకుంటారని భావించారు.కానీ అది జరగలేదు. పార్టీలో చేరకుండానే ఆమె బయ్యారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చినవారంతా టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ఫ్లెక్సీల్లోను హరిప్రియ ఫొటోలు వాడుతున్నారు. టీఆర్‌ఎస్ చేరుతున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ గులాబీ కండువాలు కప్పుకోకుండానేప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రకటించడంతో పాటు టీఆర్‌ఎస్ సభల్లోపాల్గొంటున్న హరిప్రియ మీద కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.