
వనపర్తి, వెలుగు: పశు సంపద క్రమంగా పడిపోతోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం, పాడి పరిశ్రమకు ప్రోత్సాహం లేకపోవడం ఇందుకు కారణమని అంటున్నారు. గతంలో వ్యవసాయం చేసేవారు రెండు, మూడు బర్రెలను పోషిస్తూ పాడిపరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం పొందేవారు. వ్యవసాయంలో ప్రతి పని యంత్రాల ద్వారా చేస్తుండడంతో వ్యవసాయంలో ఎద్దుల వాడకం తగ్గిపోతోంది. వాటి స్థానంలో పొలాల్లో ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో పశువుల సంతతిలో బర్రెలు, ఎద్దులు 15 శాతానికి పైగా తగ్గిపోయాయి. ఈక్రమంలో మాంసం కోసం వినియోగించే మేకలు, గొర్రెలు, కోళ్ల సంతతి పెరుగుతూ వస్తోంది. వీటితో పాటు కుక్కలు కూడా 15శాతం పెరిగాయి.
పశు పోషణకు ప్రోత్సాహం కరువు..
పశుపోషణపై మక్కువ ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో, వాటిని పోషించేందుకు ముందుకురావడం లేదు. బర్రెలు, ఎద్దుల దాణా ఖర్చు పెరిగింది. బర్రెలను ఉన్నంతలో పోషించుకుంటే పాలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. దీంతో ప్రైవేట్ డెయిరీలకు పాలు అమ్ముకోవాల్సి వస్తోంది. స్థానికంగా ప్రభుత్వ పాలసేకరణ కేంద్రం ఉన్నా.. రైతులు పెద్దగా పాలు పోయడం లేదు. బిల్లులు ఆలస్యం కావడం, ప్రోత్సాహకాలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతులు ప్రైవేట్ డెయిరీలను అశ్రయిస్తున్నారు.
బ్యాంకు రుణాలు ఇయ్యట్లే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల స్కీంలో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఆ పథకాన్ని నిలిపేశారు. ఆ పథకానికి సంబంధించి ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి. వాతావరణం దోబూచులాడడం, పంటలకు తెగుళ్లు, అకాల వర్షాలతో నష్ట పోవడంతో రైతులు పాడిపరిశ్రమను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.
అయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. బర్రెలు, ఎద్దులు కొనుగోళ్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. బర్రెల కోసం జిల్లా నుంచి 705 అప్లికేషన్లు బ్యాంకులకు పంపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదిస్తే రైతుల అప్లికేషన్లను బ్యాంకులకు ఫార్వర్డ్ చేశామని, త్వరలోనే లోన్ మంజూరయ్యేలా చూస్తామని చెబుతున్నారని రైతులు
అంటున్నారు.
ఇంకా లెక్కలు సేకరిస్తున్నాం,,
ఈ ఏడాది పశుగణన చేపట్టాం. ఆవులు, గేదెల సంఖ్య తగ్గినట్లు గుర్తించాం. ఇంకా లెక్కలు సేకరిస్తున్నాం. పశుసంతతి తగ్గడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం. అనంతరం ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తాం.
వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా వెటర్నరీ ఆఫీసర్, వనపర్తి
జిల్లాలో పశు గణన వివరాలు
పశువులు గతంలో.. ప్రస్తుతం
బర్రెలు, 1,47,000 1,24,500
ఆవులు, ఎద్దులు
గొర్రెలు 9,76,000 12,20,000
మేకలు 80,000 1,00,000
దేశీ కోళ్లు 20,000 25,000
ఫారం కోళ్లు 7,59,000 9,48,758
కుక్కలు 19,768 22,733