
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
సూర్యాపేట, వెలుగు : తెల్ల రేషన్‌కార్డుల పంపిణీని ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించి తిరుమలగిరిలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం తిరుమలగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.
తెల్లరేషన్ కార్డుల పంపిణీతో రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి మేలు కలుగుతుందన్నారు. సన్నబియ్యం పంపిణీ హుజూర్‌నగర్ నుంచి, రేషన్ కార్డుల పంపిణీ తిరుమలగిరి నుంచి ప్రారంభం కావడం గర్వంగా ఉందన్నారు. నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగానే సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా.. మార్పులు, చేర్పులకు సైతం అవకాశం ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కులగణన డిమాండ్‌కు పచ్చజెండా ఊపినట్లు గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకురావడంతో పాటు ఈ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.