
- జనరల్, రిజర్వుడ్ కలిపితే మెజార్టీ స్థానాల్లో బీసీలకు చాన్స్
- పార్టీ టికెట్ల కోసం ఆశావహుల ప్లాన్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఇక బీసీల హవా పెరగబోతుంది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల నుంచి పోటీ చేయాలనుకునే లీడర్ల ఆశలు చిగురించాయి. ఇప్పటికే ఆశావహులు పార్టీ టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేశాక రిజర్వేషన్ల ఖరారు కాగానే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీసీలకు కేటాయించబోయే 42 శాతం రిజర్వుడ్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ స్థానికంగా బలమున్న బీసీ లీడర్లు సత్తా చాటే అవకాశముంది. దీంతో మెజార్టీ స్థానాల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక వేగంగా ఎన్నికల ప్రక్రియ..
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం నిరుడు జనవరి 31తో ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గ్రామాల్లో స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఆ తర్వాత నిరుడు జూన్‌లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీలు, మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లలోనూ పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థలన్నీ దాదాపు స్పెషలాఫీసర్ల పాలనలోనే నడస్తున్నాయి. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉన్నప్పటికీ.. కులగణన, బీసీ రిజర్వేషన్ల హామీ కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. త్వరలోనే ఆర్డినెన్స్ ఇవ్వడంతోపాటు స్థానిక సంస్థల్లో వివిధ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఇవ్వనుంది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా...
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 61 జడ్పీటీసీలు, 61 ఎంపీపీ స్థానాలు ఉండగా.. ఇందులో బీసీలకు 25 నుంచి 26 చొప్పున రిజర్వ్ అయ్యే అవకాశముంది. ఎంపీపీలు కూడా అదే స్థాయిలో దక్కే అవకాశం ఉంది. ఎంపీటీసీ స్థానాలు 646 ఉండగా.. ఇందులో 271 స్థానాలు, 1229 గ్రామపంచాయతీల్లో 516 పంచాయతీలు బీసీలకు కేటాయించనున్నారు.
కరీంనగర్ జిల్లాలో..
పదవి మొత్తం
స్థానాలు బీసీలకు
(సుమారు)
జడ్పీటీసీ 15 6
ఎంపీటీసీ 170 71
జీపీలు 318 133
జగిత్యాల జిల్లాలో..
జడ్పీటీసీ 20 8
ఎంపీటీసీ 216 91
జీపీలు 385 162
పెద్దపల్లి జిల్లాలో..
జడ్పీటీసీ 14 6
ఎంపీటీసీ 137 58
జీపీలు 266 112
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
జడ్పీటీసీ 12 5
ఎంపీటీసీ 123 52
జీపీలు 260 109