వరంగల్, వెలుగు: రాష్ట్రంలో వరుస ఓటములతో బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానసిక స్థితి బాలేదని, ఆయనో డర్జీ పొలిటీషియన్ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నగరంలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ నేత రాహుల్‍గాంధీ, సీఎం రేవంత్‍రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు.
కేటీఆర్ అబద్దాల జీవితం ఎలా ఉంటుందో స్వయానా కల్వకుంట్ల ఆడబిడ్డనే చెబుతోందన్నారు. రాహుల్‍పై ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్న కేటీఆర్ తమ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఎందుకు సోనియమ్మ కాళ్లు మొక్కారో చెప్పాలన్నారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వ హయాంలో 7 వేల మంది రైతులు చనిపోయారని, రైతులకు ఖమ్మంలో బేడీలు వేసిన చరిత్ర బీఆర్‍ఎస్ పార్టీదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎదుటివారి హోదా, వయసుకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిన మాట్లాడితే అతనికి థర్డ్ డిగ్రీ తప్పదని హెచ్చరించారు.
వరి వేస్తే ఉరి అని మాట్లాడింది కేసీఆర్ కాదా అంటూ మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, నేతలు అన్వేశ్ రెడ్డి, బంక సరళ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందించారు.
