
- కేటీఆర్ విదేశీ పర్యటనలపై బల్మూరి వెంకట్ సవాల్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ యూకే పర్యటన పేరుతో పారిస్‌కు వెళ్లి తన శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా డిటాక్స్ చేయించుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. మే, జూన్ నెల్లలో కేటీఆర్ విదేశీ పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏం చేశాడో ఆధారాలతో సహా నిరుపించేందుకు తాను రెడీగా ఉన్నానని తెలిపారు. దమ్ముంటే ఈ ఆరోపణలు తప్పని కేటీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో బల్మూరి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సాయంతో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పారిస్‌కు వెళ్లి డ్రగ్స్ డిటాక్స్ చేయించుకున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలు వాస్తవమా కాదా అని కేటీఆర్ స్వయంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దుర్గం చెరువు, బీఎన్ రెడ్డి అపార్ట్‌మెంట్‌లో కేటీఆర్ చేసిన కార్యకలాపాలు తనకు తెలుసని, ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని, అతనికి పిచ్చి ముదిరిందని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టేలా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.