కాళేశ్వరం నిషేధిత ప్రాంతంగా మారింది .. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తం: జీవన్ రెడ్డి

కాళేశ్వరం నిషేధిత ప్రాంతంగా మారింది .. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తం: జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి ప్రాజెక్టుగా కేసీఆర్ మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తన మేదోమథనంతో కట్టానని కేసీఆర్ అన్నారని, ఇప్పడు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిషేధిత ప్రాంతంగా మారిందన్నారు. ఆదివారం జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో మీడియాతో జీవన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ స్వార్థం, అవినీతి, కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టుగా మారిందని మండిపడ్డారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై బీజేపీ నాయకులు మాటలకే పరిమితం అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, బీజేపీ అంతర్గత ఒప్పందంలో భాగమే కాళేశ్వరం అని ఆరోపించారు. రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. కేసీఆర్ కటకటాల వెనక్కి పోవడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఓటు అనే విష్ణుచక్రంతో కేసీఆర్‌‌ను ఓడిస్తారన్నారు.