విద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలె

విద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలె

జగిత్యాల: విద్యుత్ సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లో కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్లుగానే  ఇప్పుడు కూడా 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సబ్ స్టేషన్ ల వారీగా వివరాలు తీసుకొని విద్యుత్ సరఫరా పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పి నాలుగేళ్లు గడిచినా నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. 

రైతులకు ఇచ్చే రాయితీలు వదిలేసి... రైతు బంధు గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. రైతు బంధు పేరిట కేసీఆర్ ప్రభుత్వం బడా భూస్వాములకు ఇష్టమొచ్చినట్లుగా డబ్బు పంచిపెడ్తోందని ఆరోపించారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన... పూర్తి స్థాయిలో రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పంట బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మూడేళ్లుగా రైతులకు పైసా పరిహారం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు వేదికలు అసాంఘిక కార్యాకలాపాలకు నిలయంగా మారాయని చెప్పారు.