
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ కొరత అంటూ బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో విద్యుత్ లైన్ల మరమ్మతుల వల్ల కరెంట్ కట్ చేశారని, అయితే బీఆర్‌ఎస్‌కు చెందిన పత్రిక నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మాత్రం రాష్ట్రంలో కరెంట్ కోతలు, ఎమ్మెల్సీ పోగ్రాంలో కరెంట్ కట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జగిత్యాలలో ప్రభుత్వ కార్యక్రమం ఉందని కరెంట్ సిబ్బందికి అధికారులు సమాచారం ఇవ్వలేదని, మరమ్మతుల కారణంగా కరెంట్ కట్ చేశారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను పాల్గొన్న పోగ్రాంలో అధికారులు, మీడియా, పబ్లిక్ అందరూ ఉన్నారని వాస్తవం ఏంటో వారికి తెలుసన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తుందని చెప్పారు. ఇటీవల 200 యూనిట్ల వరకు గృహజ్యోతి స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేశామని తెలిపారు. కొత్త ప్రభుత్వం చేస్తున్న పనులను జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌తో పాటు వాళ్ల మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్, వాళ్ల మీడియా అవివేకానికి నిదర్శనమన్నారు.