
హైదరాబాద్, వెలుగు: బిహార్‌లో ఓట్ల చోరీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపిస్తే.. దీనికి సమాధానం చెప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చీఫ్ కమిషనర్ రాజకీయ చాలెంజ్ విసరడం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. ఇది ఆయన స్థాయిని తగ్గించుకోవడమేనన్నారు.
మోదీ సర్కార్‌కు ఎన్నికల సంఘం తొత్తుగా మారిందని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేసేందుకు 2023లో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్లను నియమించే కమిటీలో ప్రతిపక్ష నేతకు చోటు కల్పించాలని కోర్టు సూచించిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తే ఇలాంటి ఓట్ల చోరీ ఘటనలు జరుగకపోయి ఉండేవన్నారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి సీఈసీ నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.