మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. అత్యవసర విచారణ జరపాలని పిటిషన్

మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. అత్యవసర విచారణ జరపాలని పిటిషన్
  • అంతకు ముందు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన సీనియర్ నేతలు
  • నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​
  • మీనాక్షిపై కోర్టు నోటీసు మాత్రమే ఉంది.. కేసు నమోదు కాలేదు: సింఘ్వీ
  • క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌ కుదరకే.. ఇలా కుట్ర చేశారు: మీనాక్షి నటరాజన్​

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్​ పార్టీ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించిన రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని కోరింది. మీనాక్షిపై తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పిటిషన్​లో పేర్కొంది. 

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్​ రమేశ్, అభిషేక్​ మను సింఘ్వీ తదితరులు ఎన్నికల సంఘాన్ని బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం చట్టబద్ధంగా లేదన్నారు. ఆర్‌‌‌‌వో ఉత్తర్వు 2+2=4 అని కాకుండా 2+2=7 అని చెప్పినట్టుగా ఉందన్నారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 33ఏ ప్రకారం రెండేండ్లకు మించి శిక్ష పడే అవకాశమున్న కేసులు, కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసిన కేసుల వివరాలను మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుందని సింఘ్వీ పేర్కొన్నారు. 

తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌‌‌‌కు కేవలం కోర్టు నోటీసు మాత్రమే అందిందని, కేసుపై కోర్టు ఇంకా ‘కాగ్నిజెన్స్’ కూడా తీసుకోలేదని తెలిపారు. ‘‘కాగ్నిజెన్స్ లేకపోతే చట్టం దృష్టిలో క్రిమినల్ కేసే ఉండదు. అలాంటప్పుడు ఆమె ఏ కేసును దాచిందని అంటున్నారు?’’ అని ప్రశ్నించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి విస్తృత అధికారాలు ఉన్నాయని సింఘ్వీ పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ తప్పుగా నామినేషన్ తిరస్కరించినప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సరిదిద్దే అధికారం ఉందన్నారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి సందర్భాల్లో ఈసీ జోక్యం చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు.   

రాజకీయ కుట్రే : మీనాక్షి నటరాజన్

తన నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. తెలంగాణలో ఓ కోర్టు వ్యవహారాన్ని కారణంగా చూపుతూ తన నామినేషన్‌‌‌‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో రాజ్యసభ అభ్యర్థిని బరిలోకి దించిందన్నారు. 

మొదట క్రాస్‌‌‌‌ ఓటింగ్‌‌‌‌, పార్టీ ఫిరాయింపుల ద్వారా సీటు కొట్టెయ్యాలని చూసిందని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉండడంతో కొత్త వ్యూహానికి తెరతీసిందన్నారు. తనపై ఒక లీగల్ నోటీసు మాత్రమే ఉందని, అది క్రిమినల్ కేసు కాదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. మీనాక్షి నామినేషన్​ తిరస్కరణను  మధ్యప్రదేశ్ సీఎం మోహన్​ యాదవ్  స్వాగతించారు. అభ్యర్థులు తమపై పెండింగ్‌‌‌‌లో ఉన్న క్రిమినల్ కేసులను అఫిడవిట్‌‌‌‌లో వెల్లడించాలన్నారు. 

ఓటమి తప్పదనే అసంపూర్ణ నామినేషన్: బీజేపీ

ఓటమి తప్పదని ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసంపూర్ణ నామినేషన్ దాఖలు చేసిందని బీజేపీ ఎంపీ, జాతీయ ప్రతినిధి  సుధాంశు త్రివేది ఆరోపించారు. తెలంగాణలో 2025లో పార్టీ నేతపై ఓ మహిళా కార్యకర్త ఫిర్యాదు చేసిందని, ఆ ఫిర్యాదులో మీనాక్షి పేరు కూడా ఉందని తెలిపారు. 

ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని చెప్పారు. “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కేసు ముగిసిందని చెప్పే అధికారిక పత్రాన్ని ఎందుకు సమర్పించలేదు? అలాగే ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఎందుకు నిలబెట్ట లేదు? ’’ అని సుధాంశు త్రివేది ప్రశ్నించారు.