కాంగ్రెస్​తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ రంజిత్ రెడ్డి

కాంగ్రెస్​తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ రంజిత్ రెడ్డి
  •    బీజేపీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడుతుంది
  •     దాని వల్ల పెట్టుబడులు రావు, అభివృద్ధి జరగదు
  •     ఆ పార్టీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం
  •     ఆరు గ్యారంటీలకు అనూహ్య స్పందన వస్తుంది
  •     రెండోసారి కూడా విజయం తనదే అని ధీమా 

హైదరాబాద్, వెలుగు: ఎంపీగా ఐదేండ్లు ప్రజల్లోనే ఉన్నానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించానని కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి అన్నారు. తనను అక్కున చేర్చుకున్న ప్రజల కోసమే రెండో సారి పోటీచేస్తున్నానని వారి ఆదరాభిమానాలే గెలిపిస్తాయని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోరిక మేరకు పార్టీ మారినట్లు తెలిపారు. 

చేవెళ్లలో రెండు జాతీయ పార్టీల మధ్యే పోటీ నెలకొందని.. బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమని చెప్పారు. బీజేపీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్​తోనే అభివృద్ధి, సంక్షేమం అని తెలిపారు. బీజేపీ ఎప్పుడూ మతం గురించి మాట్లాడుతుందని.. దాని వల్ల పెట్టుబడులు రావని, అభివృద్ధి ఉండదని అన్నారు. ముస్లింలు, సెటిలర్స్ కాంగ్రెస్​కే ఓటేస్తారని తెలిపారు. బీజేపీ కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని.. నార్త్ లో చాలా సీట్లు తగ్గిపోతాయని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలతో దేశంలో కాంగ్రెస్ బలపడిందన్నారు. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రంజిత్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ...

చేవెళ్ల పరిధిలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రభావం ఎంత వరకు ఉంటుంది?

అర్బన్​ ఏరియాలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రూరల్​ ఏరియాలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలు వేరు. పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రభావం ఏమాత్రం ఉండదు. చేవెళ్లలో రెండు జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంది. ప్రజలు కూడా జాతీయ పార్టీలకే పట్టం కడతారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేల నుంచి పూర్తి సహకారం ఉంది. ముస్లింలు, స్థానిక ప్రజలు, సెటిలర్స్ అంతా కాంగ్రెస్ కే ఓటు వేస్తారు.

ఈ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు?

జాతీయ పార్టీల మధ్య పోటీ కనుక నా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డినే. చేవెళ్ల నియోజకవర్గానికి నేనేం చేశానో, ఆయనేం చేశాడో ప్రజలకు తెలుసు. గెలుపు ఓటములను వారు డిసైడ్ చేస్తారు. విశ్వేశ్వర్ రెడ్డి కనీసం ప్రజలను గుర్తుపట్టడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్యూలో చెప్పాడు.

కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఊహించారా?

వందశాతం రెండోసారి ఎంపీగా పోటీ చేస్తానని అనుకున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని అస్సలు ఊహించలేదు. బీఆర్ఎస్​లో టికెట్ ఇస్తరా లేదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒకవేళ ఇవ్వకపోయినా బాధపడేవాణ్ని కాదు. చేవెళ్ల ప్రజలే నా ఆశ నా శ్వాస. వారి అభివృద్ధే నాలక్ష్యం. వారు అభివృద్ధి చెందాలంటే నేను అధికార పార్టీలో ఉండాలి. కొన్ని రోజులుగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ మారాల్సి వచ్చింది.

ఆరు గ్యారంటీలపై ప్రజలు ఏమంటున్నరు?

అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ఎజెండా. సంక్షేమ పథకాలను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారంటీలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. బీజేపీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం. ఇలాంటి స్కీంల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని భావిస్తది ఆ పార్టీ. పేదలకు సంక్షేమ పథకాలు అవసరం. అభివృద్ది, ప్రజా సంక్షేమంతో ముందుకు పోవాలి. బీజేపీలా ఎప్పుడూ మతం గురించి మాట్లాడితే.. పెట్టుబడులు రావు. అభివృద్ధి కుంటుపడుతుంది.  

దేశంలో మోదీ వేవ్​ కొనసాగుతుందా? 

కాంగ్రెస్​ అధికారంలోకి రాదనే ప్రచార ప్రభావం ఎలా ఉంటుంది?

బీజేపీ వాళ్లు అనాలోచితంగా మాట్లాడుతున్నారు. బీజేపీ కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. కానీ, ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుస్తామని భ్రమపడుతున్నారు. నార్త్ లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలవదు. రాహుల్​ గాంధీ యాత్రలతో సౌత్ తో పాటు నార్త్ లో కూడా కాంగ్రెస్ బలపడింది. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీనే.

బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు?

పార్టీ మార్పుపై విమర్శలు రావడం సహజం. కేటీఆర్ నాకు అత్యంత సన్నిహితుడు. నేను పార్టీ మారడం వల్ల ఆయన బాధపడి ఉండొచ్చు. కానీ,​ నమ్మక ద్రోహం చేశాననడం సరికాదు. నేనేం నమ్మక ద్రోహం చేశానో కేటీఆర్ చెప్పాలి. నేను చేవెళ్ల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారాను. నాకంటూ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు. నా వ్యాపారాలు అన్ని బాగానే నడుస్తున్నాయి.

బీఆర్ఎస్​ను ఎందుకు వీడారు?

అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. నన్ను గెలిపించిన చేవెళ్ల ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. అధికార పార్టీలో ఉంటేనే నా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాను. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలిచినా చేవెళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయే వాడిని. అలాగే మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్​ను వీడాల్సి వచ్చింది.

రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది?

రంజిత్​రెడ్డి: నేనెవరో తెలియనప్పుడు చేవెళ్ల ప్రజలు నన్ను ఆదరించారు. ఐదేండ్లు ప్రజల్లోనే ఉన్నాను. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నాను. అందిరితో మమేకమై వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నాను. వారి నుంచి ఆదరాభిమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఏ ఊరు వెళ్లినా ప్రజలు ఘనస్వాగతాలు పలుకుతున్నారు. నన్ను అక్కున చేర్చుకున్న ప్రజల కోసమే రెండోసారి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాను. రెండోసారి కూడా గెలుపు నాదే.