సీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదు : ఎంపీ చామల

సీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదు : ఎంపీ చామల
  • అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిస్తం

న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ సీఎం అవుతానని పగటి కలల కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే.. నాన్న కేసీఆర్, బావ హరీశ్ రావును బతిమిలాడుకొని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావొచ్చని చెప్పారు. అప్పుడు పదేండ్ల బీఆర్ఎస్, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చిద్దామని సవాల్ విసిరారు. అంతేకానీ.. సీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్ కు ఏమాత్రం లేదన్నారు. పదేండ్లలో దరిద్రపు పాలన చేశారు కాబట్టే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కేటీఆర్ ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో చామల మాట్లాడారు. 

సీఎం ఢిల్లీ పర్యటనకు ఎందుకు వచ్చారో పేపర్లు చదివితే తెలుస్తుందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో భేటీలు ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు.. ప్రజాపాలన సాగుతున్న తీరును కళ్లు తెరచి చూడాలని చురకలంటించారు. కేటీఆర్ ఎంత చెప్పినా టీవీ చానల్స్ కి చెప్పుకోవాల్సిందే తప్ప.. బీఆర్ఎస్ ఎలాంటిదో ప్రజలకు తెలుసన్నారు. అందుకే ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా జరుగుతోందని, అన్ని వర్గాలను మేలు చేసేలా ముందుకెళ్తున్నట్టు చెప్పారు.