ఏ క్షణమైనా కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారు : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏ క్షణమైనా కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారు : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రేకి చెప్పినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికలకు 6 నెలల ముందు 50 శాతం టిక్కెట్లు ఖరారు చేయాలని చెప్పానన్నారు. తాము ‘హాథ్​ సే–హాథ్​ జోడో యాత్ర’పై చర్చించామన్నారు. గాంధీభవన్‌లో కాదు గ్రౌండ్​లోకి వెళ్లాలని చెప్పానన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వివరించానన్నారు. ఇన్‌ఛార్జి కూడా జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టాలని సూచించానని, అందుకు థాక్రే అంగీకరించారని చెప్పారు. వీటితో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు వివరించారు.

అంతకుముందు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డితోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. పలు విషయాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. మరోవైపు.. కాంగ్రెస్​ సీనియర్​నాయకులు మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ మానిక్‌రావు థాక్రేతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. 

ఎస్సీ, ఎస్టీ లోక్ సభ స్థానాల్లో ముగ్గురు సమన్వయకర్తల నియామకం

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ లోక్ సభ స్థానాల్లో ముగ్గురు సమన్వయకర్తలను కాంగ్రెస్​ అధిష్టానం నియమించింది. ఎల్ డీఎం పేరిట సమన్వయకర్తలను నియమించింది. రాష్ట్రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సమన్వయకర్తలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ (ఎస్టీ) నియోజకవర్గానికి పిన్నింటి ర‌ఘునాథ్‌రెడ్డి, పెద్దప‌ల్లి (ఎస్సీ) నియోజకవర్గానికి వైద్యుల అంజ‌న్ కుమార్, వ‌రంగ‌ల్‌ నియోజకవర్గానికి అహ్మద్ నాసిర్‌ ను నియమించింది.