రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేస్తం

రిజర్వేషన్లపై 50  శాతం పరిమితి ఎత్తేస్తం
  • కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ

రాంచీ: లోక్​సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులాలవారీగా జనాభా లెక్కలు తీస్తామన్నారు. సోమవారం జార్ఖండ్‌‌‌‌లోని రామ్‌‌‌‌గఢ్ జిల్లా నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు.

దేశవ్యాప్తంగా గిరిజనులు, దళితులు, బీసీలు అన్యాయానికి గురవుతున్నారని, రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడమే అందుకు పరిష్కారమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించబోమని, బీసీల రిజర్వేషన్ కోటా పెంచుతామని హామీ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఎన్నికలప్పుడు ఓబీసీ అని చెప్పుకుని ఓట్లడుగుతాడు. కులాలవారీగా జనాభా లెక్కలు తీద్దామన్నప్పుడు మాత్రం మన దేశంలో కులమత భేదాలే లేవంటూ నీతులు చెప్తాడు” అని రాహుల్ కామెంట్ చేశారు.

సీఎం గిరిజనుడు కాబట్టే జార్ఖండ్​లో జేఎమ్ఎమ్ -కాంగ్రెస్ -ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఆరోపించారు. వాళ్ల కుట్రలను సాగనివ్వకుండా పేదల ప్రభుత్వాన్ని నిలబెట్టారని చంపయీ సోరెన్ నేతృత్వంలోని బృందాన్ని ఆయన అభినందించారు.