గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతం పెంచాలె

గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతం పెంచాలె

పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా.. ఎటువంటి వసతులు లేవన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు. వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా రాములునాయక్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, ఎంపీలు హాజరయ్యారు.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణకు చెందిన గిరిజన నాయకులు కలిశారు. 6 శాతం నుంచి 10 శాతం తమ రిజర్వేషన్లు పెంచాలని గత ఎనిమిదేళ్లుగా గిరిజనులు కోరుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.