ఆర్టీసీ పై జోక్యం చేసుకోండి: ప్రధాని కి కాంగ్రెస్ ఎంపీల వినతి

ఆర్టీసీ పై జోక్యం చేసుకోండి: ప్రధాని కి కాంగ్రెస్ ఎంపీల వినతి

టీఎస్ ఆర్టీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.., 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, అనంతర పరిణామాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు గురువారం ప్రధాని మోడీని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తుందని, ప్రభుత్వ వైఫల్యంతో కార్మికులను బలి చేస్తున్నారని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎం.ఏ ఖాన్ లు ప్రధాని కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.

“దేశంలో అతిపెద్ద, సురక్షితమైన ప్రజా రవాణా సంస్థగా ఆర్టీసీ కి పేరుంది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్బంగా ఆర్టీసీ కూడా విభజన జరిగింది. గతంలో 57 వేల మంది ఉండే ఆర్టీసీ ఇప్పుడు 49 వేల మంది ఉద్యోగులతో నడుస్తుంది. ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు, భూములు ఉన్నాయి. ఆర్టీసీ సంస్థను టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది. ఆర్టీసీ ని ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేస్తుంది. ప్రభుత్వ నుంచి ఆర్టీసీ కి ఇవ్వాల్సిన రాయితీ, వివిధ రకాల బస్ పాస్ ల డబ్బులు ఇవ్వకుండా నిలిపివేసింది. అలాగే ఆర్టీసీ వాడుతున్న పెట్రోల్, డీజిల్ పైన దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ పన్నులు వేయడం వల్ల కూడా ఆర్టీసీ పైన భారం పడుతుంది. ఆర్టీసీ ని కాపాడుకుందుకు 49 వేల మంది 50కి పైగా రోజుల నుంచి సమ్మె చేశారు. దాదాపు 30 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోట్లు వల్ల మృత్యువాత పడ్డారు.

పక్కనున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా 5100 రూట్లు ను ప్రైవేట్ పరం చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసింది. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ 52 రోజుల తర్వాత సమ్మె విరమించి ఉద్యోగాలలో చేరుతామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చేర్చుకోకుండా పోలీసుల చేత వారిని అరెస్టులు చేయిస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ లో 33 శాతం వాటా కలిగి ఉంది. అందువల్ల ఈ విషయాలపై మీరు (ప్రధాని మోడీ) కలుగజేసుకొని 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలి.” అని ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఎంపీలు.