దత్తత పేరుతో మోసం చేసిన కేసీఆర్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

దత్తత పేరుతో మోసం చేసిన కేసీఆర్ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : సీఎం కేసీఆర్ దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ నల్గొండ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంగళవారం పట్టణంలోని 7, 9 వార్డుల్లోని పలు కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండకు చేసిందేమీ లేదని,  ఒక్క రోడ్డు వేస్తే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందినట్లా అని  ప్రశ్నించారు.  తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎంజీ యూనివర్సిటీ, నల్గొండ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, గ్రామాల్లో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.  కాంగ్రెస్  హయాంలో చేపట్టిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

గ్రామాల్లోని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,  కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం గ్రామాలలో గుంతలు పడ్డ రోడ్లపై మట్టి పోసిన దిక్కేలేదన్నారు.  కాంగ్రెస్  అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్‌‌‌‌‌‌‌‌లతో పాటు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హామీలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాటిచ్చారు.  

అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం అడ్డ గూడూరు వైస్ ఎంపీపీ దైద పురుషోత్తం రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సంగు సురేందర్ రెడ్డి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ సూరారం నవీన్ కుమార్, డాక్టర్ చిప్పలపల్లి నగేశ్, ముక్కామల శ్రీకాంత్, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాపోల్ యాదగిరి  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. కాగా, కోమటిరెడ్డి సతీమణి సబిత, కూతురు శ్రీనిధి  31 వార్డులో ప్రచారం నిర్వహించారు.