కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోడీ ఫైర్

కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోడీ ఫైర్

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్‌‌ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుపడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే డిబేట్స్ జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మోడీ మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి, కరోనా లాంటి సమస్యపై రివ్యూకు పిలిచినా రాలేదన్నారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై సమీక్షించేందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదని, ఇతర పార్టీలను కూడా రానీయకుండా చేయాలని ప్రయత్నించిందని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు ముందుకు రాకుండా కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్న ఈ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మీడియా ద్వారా వాస్తవాలను తెలియజేయాలని బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని ప్రజలకు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి సహా బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.