- రిజర్వేషన్ల అంశాన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం
- పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృతస్థాయి మీటింగ్
- హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, ఇన్చార్జీలు
- రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ
- మీటింగ్‌కు తెలంగాణ నుంచి ఇన్చార్జి దీపా దాస్ మున్షి హాజరు
- సెబీ చైర్‌పర్సన్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఈ నెల 22న ఈడీ ఆఫీసుల ముట్టడి: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రజల్లోకి వెళ్లనున్నది. కులాలవారీగా జనగణన జరిగితేనే వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్త బహిరంగ సభలకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఈ సభలతో త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఒక సభను నిర్వహించనున్నట్టు సమాచారం.
మంగళవారం ఢిల్లీ అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, అజయ్ మాకెన్, సచిన్ పైలట్, రాజీవ్ శుక్లా సహా పలువురు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ చీఫ్ లు పాల్గొన్నారు.
తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షి, వ్యూహకర్త సునీల్ కనుగోలు, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఏపీ ఇన్చార్జి మాణికం ఠాగూ ర్, పలువురు హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఈ భేటీలో.. రాబోయే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విదేశీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ కు హాజరుకాలేదు.
కులగణనతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం
కుల గణనతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం చేకూరుతుందని పార్టీ విస్తృతస్థాయి మీటింగ్ లో పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశలో దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచేలా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందుకు జనగణనలో కులగణన అంశం ప్రధానమైందని అన్నారు. త్వరలో ఎన్నికలు జరుగబోయే హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ అంశమే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
దీంట్లో భాగంగా భారత్ జోడో తరహాలో ఈ అంశంపై రాహుల్ గాంధీ రాష్ట్రాలవారీగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పుపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. తెలంగాణ తోపాటు మరో 8 రాష్ట్రాల్లో పీసీసీ ల మార్పుపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది.
ప్రక్షాళన.. యువతకు పెద్దపీట
ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయస్థాయిలో పార్టీ పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. సమర్థవంతంగా పని చేసే యువ నాయకులకు నేషనల్ జనరల్ సెక్రటరీ, సెక్రటరీ, సంస్థాగత బాధ్యతలు కట్టబెట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రాహుల్ మాదిరిగా చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే నేతలు, పార్టీ విధేయులు, ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తున్న నేతలకు ఇందులో చోటు కల్పించనున్నారు.
ఇప్పటికే రాహుల్ సూచనలతో తెలంగాణకు చెందిన ఎన్ఎస్ యూఐ నేతలు అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్ లకు లెజిస్లేచర్లుగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అలాగే, ఎన్ఎస్ యూఐ నే కాకుండా.. ఇతర అనుబంధ శాఖ లకు చెందిన యువనేతలకు ఏఐసీసీలో పెద్ద పీట వేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. పార్టీ బలోపేతానికి విస్తృత కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
22న ఈడీ ఆఫీసుల ముట్టడి: కేసీ వేణుగోపాల్
సెబీ చైర్‌పర్సన్‌ను తొలగించాని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22 న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆఫీసులను ఎదుట ఆందోళన చేయనున్నట్టు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలోని పెద్ద స్కామ్స్‌లో హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడి ఒకటన్నారు. సెబీ– అదానీకి సంబంధించిన ఈ కుంభకోణంపై చర్చించినట్టు చెప్పారు. ఈ స్కామ్‌లో ప్రధాని మోదీ ప్రమేయం కూడా ఉన్నదని ఆరోపించారు. అలాగే వయనాడ్ వరద ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించడం, కులగణన, హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలపై చర్చించినట్టు తెలిపారు.
ప్రజా సమస్యలపై దేశవ్యాప్త పోరాటం: ఖర్గే
కులగణన దేశ ప్రజల డిమాండ్ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. ఎన్డీయే సర్కార్ నేతృత్వంలోని మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతున్నదని విమర్శించారు. ఎన్డీయే హయాంలో దేశంలో రైలు పట్టాలు తప్పడం ఆనవాయితీగా మారిందన్నారు. దీంతో కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ప్రకృతి విపత్తులు, కుప్పకూలుతున్న మౌలిక సదుపాయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ సమస్యలపై దేశవ్యాప్త పోరాటానికి రూపకల్పన చేసి, ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)– అదానీల మధ్య అనుబంధం పై సమగ్ర దర్యాప్తు నకు డిమాండ్ చేశారు. తక్షణమే సెబీ చైర్‌పర్స న్ రాజీనామాను కోరాలని, ఈ విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజ లకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా మారిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న గృహ పొదుపుపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పంటల ఎమ్మెస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాల ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
