ధర్మపురిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

ధర్మపురిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్

జగిత్యాల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని దర్శనం అనంతరం పోలీసులు ముందస్తు  అరెస్ట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరవ్వకుండా ముందస్తు అరెస్టు చేశారు. 

తనను ముందస్తు అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని.. ప్రశ్నించే వారిని అణిచివేయాలని ప్రయత్నిస్తూ రజాకర్ల పాలనను గుర్తుకు తెస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ విధానం ప్రవేశపెట్టి అక్రమంగా కాజేస్తోందని ఆరోపించారు. దొడ్డి దారిన నిధులు కాజేయడమే కాకుండా ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా..? అని ప్రశ్నించారు.

‘రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నిరసన తెలిపే కార్యక్రమానికి హాజరుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంటోంది. గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన కాజేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున గట్టిగా ప్రశ్నిస్తాం. సర్పంచులకు అండగా ఉంటాం’ అని చెప్పారు.

‘తాము ప్రగతిభవన్ ముట్టడో..అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టలేదు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? చూస్తుంటే రజాకర్ల పాలనను గుర్తు చేస్తున్నారు’’ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురిలో స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్తుంటే నిర్బంధంలో తీసుకోవడం సరైన పద్ధతి కాదు. నియంతృత్వం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.