సోనియా గాంధీ బర్త్‌ డే స్పెషల్: ఫ్రీగా ఉల్లిపాయల పంపిణీ

సోనియా గాంధీ బర్త్‌ డే స్పెషల్: ఫ్రీగా ఉల్లిపాయల పంపిణీ
  • వెరైటీగా సెలబ్రేట్ చేసిన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి

ఉల్లి ధరలు భారీగా పెరగడంతో జనం వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. రాజకీయ నాయకుల నిరసనల్లో ఉల్లిని బంగారంతో పోలుస్తూ ప్రభుత్వాలు ధరలను కంట్రోల్ చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆనియన్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బర్త్ డేలో స్పెషల్ గిఫ్ట్‌గా మారాయి. ఆ పార్టీ కార్యకర్తలకు కిలో చొప్పున గిఫ్ట్ ప్యాకింగ్ చేసి మరీ ఈ స్పెషల్ కానుకల్ని అందించారు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజును వెరైటీగా సెలబ్రేట్ చేశారు పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి. సోమవారం పాండిచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి సోనియా బర్త్ డేని వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత నారాయణ స్వామి కార్యకర్తలకు అనూహ్యమైన కానుకలు అందించారు. తలా ఓ కిలో చొప్పున ఉల్లిపాయల్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేసి పంపిణీ చేశారు. రూ.200 వరకు చేరిన ఉల్లిని తమ అధినేత్రి బర్త్ డే నాడు కానుకగా అందించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఆయన కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే సీఎం కాదని, ఉల్లి ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న పేదలను పట్టించుకోవాలని డిమాండ్ చేశాయి.