దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్‌‌ ధర్నాలు

దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్‌‌ ధర్నాలు
  • సెబీ చైర్‌‌‌‌పర్సన్‌‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్‌‌

న్యూఢిల్లీ: హిండెన్‌‌బర్గ్‌‌ రీసెర్చ్‌‌ ఆరోపణల నేపథ్యంలో సెక్యూరిటీ ఎక్స్ఛెంజ్‌‌ బోర్డ్ ఆఫ్‌‌ ఇండియా (సెబీ) చైర్‌‌‌‌పర్సన్‌‌ మాధబి బుచ్‌‌ రాజీనామా చేయాలని డిమాండ్‌‌ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రస్‌‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది. ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) ఆఫీసుల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు భైఠాయించి నిరసనలు తెలిపారు.

ఢిల్లీలో జంతర్‌‌‌‌మంతర్‌‌‌‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పార్టీ చీఫ్‌‌ దేవేందర్‌‌‌‌ యాదవ్‌‌, సీనియర్‌‌‌‌ లీడర్‌‌‌‌ సచిన్‌‌ పైలెట్‌‌, కన్నయ్య కుమార్‌‌‌‌, ఉదిత్‌‌ రాజ్‌‌ ఇతర నాయకులు ఆందోళనలు చేపట్టారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌‌, తెలంగాణ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్‌‌ నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్‌‌‌‌ కెనాన్లను ఉపయోగించారు. మరోవైపు, అదానీ అంశంపై దర్యాప్తు చేసేందుకు జాయింట్‌‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌ చేశారు.

కేంద్రం చేతిలో ఈడీ, ఐటీ, సీబీఐ కీలుబొమ్మలు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఈడీ, ఐటీ, సీబీఐలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని కాంగ్రెస్  ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజల తరపున ప్రశ్నించిన వారిపై ఈడీ, ఐటీలను ఉసిగొల్పి కేంద్రం దాడులకు దిగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. సెబీ చైర్ పర్సన్ పై వచ్చిన ఆరోపణలపై వైఖరి ఏంటో చెప్పాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్  చేశారు. కార్పొరేట్ల నుంచి డబ్బులు దోచుకునేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను కేంద్రం వాడుకుంటున్నదని ఫైర్  అయ్యారు.

‘‘తమను ప్రశ్నించిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐలతో కేంద్రం సోదాలు చేయిస్తున్నది. కేసులు పెడుతున్నది. ప్రభుత్వానికి డబ్బు ముట్టచెబితే వదిలేస్తున్నది. అంతేకాకుండా గతంలో వారిపై ఉన్న కేసులను కూడా ఎత్తివేస్తున్నది. తనకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై కేంద్రం వేధింపులకు పాల్పడుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఉంది. కానీ, ఆ హక్కును మోదీ సర్కారు కాలరాస్తున్నది. గతంలో మా ఇంటిపైకి కూడా కేంద్ర సంస్థలను పంపించి సోదాలు చేయించారు” అని వంశీకృష్ణ తెలిపారు.