
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ అదానీ, ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎస్బిఐ, ఎల్.ఐ.సి లలో ఉన్న దేశ ప్రజల సంపాదను మోడీ ప్రభుత్వం అదానీ సంస్థలకు మళ్లించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని హిండెన్ బర్గ్ సంస్థ బహిర్గతం చేసి.. అదానీ, కేంద్ర ప్రభుత్వ మోసాన్ని బయటపెట్టిందన్నారు.
ఈ అంశంపై లోక్ సభలో తమ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే.. ప్రధాని మోడీ అవహేళనగా సమాధానం చెప్పారని అన్నారు. కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అదానీ ఆస్తులను అటాచ్ చేసి ఎస్బిఐ, ఎల్.ఐ.సిలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులపై విచారణ చేపట్టేంత వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.