
- వనపర్తి కలెక్టర్ సీరియస్
- ఆడిట్ చేయాలని ఆదేశం
- జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ ఆరోపణలు
వనపర్తి/వనపర్తి టౌన్, వెలుగు: కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించిన మిగులు నిధుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కేజీబీవీల్లో మెయింటెనెన్స్, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ప్రతీ నెల నిధులు విడుదల చేస్తోంది. విద్యాసంవత్సరం ముగిసేనాటికి కొంతమేర నిధులు మిగిలిపోయాయి. వాటిని ఆయా విద్యాలయాల్లో వివిధ రిపేర్లు తదితరాలకు ఉపయోగించుకోవాలని మార్చి 1న సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు. మార్చి 20 నాటికే మిగులు నిధులను ఖర్చు చేయాలని, వేటికి వెచ్చించాలో కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొందరు డీఈవోలు రూల్స్ పక్కనబెట్టి, ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు
సమాచారం.
సంచలనంగా డీఈవో ప్రొసీడింగ్స్
వనపర్తి జిల్లాలో 15 కేజీబీవీలు, 3 మోడల్ స్కూల్ అటాచ్డ్ హాస్టళ్లు ఉన్నాయి. 2024-–25 విద్యాసంవత్సరం ముగిసే నాటికి వీటిలో మొత్తం రూ.79 లక్షలు మిగిలిపోయాయి. ఈ నిధులతో వివిధ పనులు చేయించినా మిగిలితే స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్వెనక్కి తీసుకొని, ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. కానీ, వనపర్తి జిల్లాలో డీఈవో, కేజీబీవీ జీసీడీవో, ఎఫ్ఏవో కుమ్మక్కై, మిగులు నిధులపై కన్నేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.79 లక్షల్లో రూ.28 లక్షలు కేజీబీవీల్లో ఖర్చు చేసి, మిగతా రూ.51 లక్షలను కలెక్టర్ చైర్ పర్సన్ గా ఉన్న సమగ్ర శిక్ష బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయాలని డీఈవో ప్రొసీడింగ్స్జారీ చేయడం సంచలనంగా మారింది.
కలెక్టర్ సీరియస్
కేజీబీవీల్లో మిగులు నిధులు ఖర్చు చేసుకోవాలని డీఈవో ప్రొసీడింగ్స్ఇవ్వడంతో రిటర్న్వెళ్లిపోతాయన్న ఆత్రుతతో వనపర్తి జిల్లాలో కేజీబీవీ ఎస్వోలు అడ్డగోలు బిల్లులకు తెరలేపారు. విద్యాలయాలకు కావాల్సిన సామగ్రి పేరుతో ఆర్వో ప్లాంట్, మినీ ఆర్వో ప్లాంట్, సీసీ కెమెరాలు, సోలార్ హీటర్ రిపేర్, ఫర్నీచర్, వెట్ గ్రైండర్, కుట్టు మెషీన్, సివిల్ వర్క్, గెస్ట్ వర్కర్ల పెండింగ్ జీతాలు.. ఇలా ఇష్టారీతిన బిల్లులు పెట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎస్ వోలు బిల్లుల కోసం పీఎఫ్ఎంఎస్ సైట్ లో పీపీవోలు జనరేట్ చేయడం, డీఈవో ఆఫీస్ లో ఎఫ్ఏవో ఎలాంటి పరిశీలన చేయకుండా వాటిని అప్రూవ్ చేయడంతో ఆయా బిల్లులకు చెల్లింపులు ఈజీగా జరిగినట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ పర్చేజింగ్ కమిటీ ఏర్పాటు చేయకుండా, ఎలాంటి కొటేషన్లు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు డ్రా చేసిన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా విద్యాశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. కేజీబీవీల్లో ఆడిటింగ్నిర్వహించాలని ఆదేశించారు.
నిధుల లెక్కల పైనా అనుమానాలు
వనపర్తి జిల్లాలో డీఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో సైతం మిగులు నిధుల లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 1 నాటికి కేజీబీవీల్లో ఎన్ని నిధులున్నాయో, ఎంత ఖర్చు చేశారో స్పష్టమైన లెక్కలు డీఈవో ఆఫీస్ అధికారులకు సైతం తెలియకపోవడం విశేషం. తోచినట్లు బిల్లులు పెట్టుకొని, చివరకు మిగిలిన డబ్బులను సమగ్ర శిక్ష బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసి, చేతులు దులుపుకున్నా అధికారులు ఇప్పటికీ పరిశీలించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని విద్యాలయాల్లోనూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గద్వాల, వనపర్తి జిల్లాల డీఈవో ఒక్కరే. గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎఫ్ఏవో కూడా ఒక్కరే కావడం వాటికి బలం చేకూర్చుతోంది.
ఆడిటింగ్ చేయిస్తున్నాం
వనపర్తి జిల్లాలోని కేజీబీవీల్లో మిగులు నిధులపై కలెక్టర్ కు నోట్ ఫైల్ పెట్టి, ఎస్‌వోలకు ప్రొసీడింగ్స్ఇచ్చాం. రూ.28 లక్షలు ఖర్చు చేసుకోవాలని, మిగిలిన రూ.51 లక్షలను సమగ్ర శిక్ష బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాం. కానీ. కొందరు ఎస్ వోలు అధికంగా ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆడిటింగ్ కు ఆదేశించారు. ఆడిటింగ్చేయిస్తున్నాం.
అబ్ధుల్ ఘని, డీఈవో, వనపర్తి