ఆగస్టు 15 టార్గెట్ .. స్పీడ్ గా ఖమ్మం-దేవరపల్లి హైవే పనులు

ఆగస్టు 15 టార్గెట్ .. స్పీడ్ గా ఖమ్మం-దేవరపల్లి హైవే పనులు
  • రూ.2,214 కోట్లతో 165 కిలోమీటర్ల మేర నిర్మాణం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 105 కిలోమీటర్ల హైవే 
  • ఇప్పటి వరకు 80 శాతానికి పైగా పనులు పూర్తి 
  • 124 బ్రిడ్జిలు, అండర్​ పాస్​ల్లో 7 మాత్రమే పెండింగ్
  • ప్రధాన అడ్డంకిగా రైల్వే ఓవర్ బ్రిడ్జి, హెచ్​టీ లైన్​ మార్పు 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి పనులు స్పీడందుకున్నాయి. ఈ ఆగస్టు 15 నాటికి నిర్మాణ పనులన్నీ కంప్లీట్ చేసేలా అధికారులు పని చేస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గనుంది. మొత్తం రూ.2,214 కోట్లతో 165 కిలోమీటర్ల మేర సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు ఈ హైవేను నిర్మిస్తున్నారు. 

ఇందులో భాగంగా ఇప్పటికే సూర్యాపేట నుంచి ఖమ్మం జిల్లా పొన్నేకల్ వరకు హైవేను కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రస్తుతం పనులు జరుగుతుండగా ఇప్పటి వరకు 80 శాతం మేర కంప్లీట్ అయ్యాయని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు. రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా, బ్రిడ్జిలు, అండర్​ పాస్​ల లాంటి పెద్ద నిర్మాణాల దగ్గర ప్రస్తుతం జరుగుతున్నాయి. మొత్తం 124 మేజర్​ స్ట్రక్చర్లకు గాను ఇప్పటి వరకు 117 పూర్తి కాగా, ఏడు చోట్ల మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఇందులో ఖమ్మం దగ్గర రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణంలో డిజైన్​ మార్పుల వల్ల ఆలస్యం జరుగుతుండగా, కొదుమూరు సమీపంలో హై టెన్షన్​ విద్యుత్ లైన్ల మార్పుతో కొంత ఆలస్యమవుతున్నాయి. 

ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ప్యాకేజీలు

మొత్తం హైవే నిర్మాణాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించగా, ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ప్యాకేజీలున్నాయి. ఈ జాతీయ రహదారి పైకి ఎలాంటి పశువులు, జంతువులు రాకుండా, యాక్సెస్​ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. తల్లంపాడు నుంచి సోమవరం వరకు ప్యాకేజీ 1ని రూ.772 కోట్లతో నిర్మిస్తుండగా, 33 కిలోమీటర్లకు గాను 30 కిలోమీటర్ల పనిపూర్తయింది. ఈ పరిధిలోనే ఆర్వోబీ, విద్యుత్ లైన్ల మార్పు పెండింగ్ ఉన్నాయి. మరో మూడు బ్రిడ్జి, అండర్​ పాస్​ లు పెండింగ్ ఉన్నాయి. 

సోమవరం నుంచి చింతగూడెం వరకు ప్యాకేజీ 2ను రూ.637 కోట్లతో చేపట్టగా, 29 కిలోమీటర్లకు గాను 26 కిలోమీటర్లుకంప్లీట్ అయింది. ఈ ప్యాకేజీలో మూడు చోట్ల బ్రిడ్జి, అండర్​ పాస్​ లు పెండింగ్ ఉన్నాయి. చింతగూడెం నుంచి రేజర్ల వరకు ప్యాకేజీ 3లో రూ.804 కోట్లతో 43 కిలోమీటర్లకు గాను 37 కిలోమీటర్ల పని పూర్తయింది. ధంసలాపురం, వందనంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఈ రహదారికి సర్వీస్​ రోడ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. 

పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల

సత్తుపల్లి/ కల్లూరు, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరిశీలించారు. వేంసూరు నుంచి ధంసలాపురం వరకు గ్రీన్​ ఫీల్డ్ హైవే మీదుగా ప్రయాణిస్తూ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు.  ఈ ఏడాది జులై 15 లోగా హైవే ఒకవైపు అయినా ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల పురోగతికి ఎటువంటి సమస్యలు లేవని, అన్ని ప్యాకేజీల్లో పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు. యాక్సెస్​ కంట్రోల్డ్ హైవే కావడం వల్ల సర్వీస్​ రోడ్డు లేకపోతే సమీప గ్రామాల్లోని రైతుల ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఈ సమస్యను కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 

ఇటీవల గడ్కరీ రాష్ట్రానికి వచ్చిన సమయంలోనూ దీన్ని గుర్తుచేశామని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 3 ఎగ్జిట్లు ఉన్నాయని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే లో 3 ఎగ్జిట్లు లేవని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ మెరుగవుతుందని తెలిపారు. సత్తుపల్లి, వైరా  ఎమ్మెల్యేలు డాక్టర్​ మట్టా రాగమయి, రాందాస్ నాయక్​, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,  అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, నేషనల్ హైవే పీడీ దివ్య, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నేతలు రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.