'భారత్ జోడో యాత్ర' లోగో విడుదల చేసిన కాంగ్రెస్

'భారత్ జోడో యాత్ర' లోగో విడుదల చేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదే భారత్ జోడో యాత్ర. తాజాగా ఈ యాత్రపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులంతా సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్ట్స్ లో భేటీ అయిన ఈ నేతలు.. భారత్ జోడో యాత్రకు సంబంధించి ట్యాగ్ లైన్, లోగో, కరపత్రంతో పాటు వెబ్ సైట్ నూ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న ఈ యాత్రకు రాహుల్ గాంధీ అధ్యక్షత వహించనున్నారు.

దాదాపు 5 నెలల పాటు సాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. కాగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు పార్టీ నాయకులు పాదయాత్రలు, ర్యాలీలు సహా పలు పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాజయం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి సంకల్పంతో ఉంది.