- ఇండియా కూటమి ఐక్యతతో ముందుకెళ్తాం: పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు శుక్రవారం సీపీఐ రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయ్యారు. హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఇరు పార్టీల మధ్య రాజకీయ సమన్వయంపై చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు సమన్వయంతో పనిచేశాయని గుర్తుచేశారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కలిసి ముందుకెళ్తున్నామని, త్వరలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని సీపీఐ నేతలను కోరినట్లు తెలిపారు. సీపీఎంతోనూ మద్దతు కోసం చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ విజ్ఞప్తిపై పార్టీలో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు.
