కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ ఓ ఏటీఎంలా మారింది : మోడీ

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌  ఓ ఏటీఎంలా మారింది :  మోడీ
  • అవినీతే కాంగ్రెస్ సిద్ధాంతం ..  దుష్పరిపాలనకు మోడల్‌‌‌‌‌‌‌‌గా మారింది: ప్రధాని మోదీ
  • అవినీతికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ.. అవినీతిపై చర్యలకు నేను గ్యారెంటీ
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌  ఓ ఏటీఎంలా మారిందని కామెంట్

రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  అవినీతే కాంగ్రెస్ అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆ పార్టీకి చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ ఓ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ‘‘అవినీతి అనేది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో అంతర్లీనంగానే ఉంది. అవినీతి లేకుండా ఆ పార్టీ ఊపిరి పీల్చుకోలేదని ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో నిరూపించింది’’ అని ఎద్దేవా చేశారు. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో మోదీ పర్యటించారు. రూ.7,600 కోట్ల విలువైన 8 ప్రాజెక్టుల్లో కొన్ని ప్రారంభించి, ఇంకొన్నింటికి శంకుస్థాపన చేశారు. తర్వాత రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌.. అవినీతికి గ్యారెంటీ అయితే.. ఆ అవినీతిపై చర్యలకు తాను గ్యారెంటీ అని అన్నారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, దుష్పరిపాలనకు మోడల్‌‌‌‌‌‌‌‌గా మారిందని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించివేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. 

అరచేయితో అభివృద్ధిని అడ్డుకుంటున్నది

‘‘చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి వచ్చే 25 ఏండ్లు చాలా కీలకం. కానీ ఓ పెద్ద పంజా(హస్తం).. ఓ గోడలా అడ్డుపడుతున్నది. మీ హక్కులను హరించాలని ఆ పంజా నిర్ణయించుకున్నది. రాష్ట్రాన్ని లూటీ చేసి, నాశనం చేస్తది’’ అని ప్రధాని అన్నారు. ‘‘2018లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మీకు గుర్తు చేస్తున్నా. మొత్తం 36 హామీల్లో మద్యపాన నిషేధం ఒకటి. షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిషేధించే హక్కును గ్రామసభకు ఇస్తామని వాళ్లు చెప్పారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాల్సింది పోయి.. కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌‌‌‌‌‌‌‌లకు కాంగ్రెస్ పాల్పడింది. ఆ డబ్బు అంతా కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది’’ అని ఆరోపించారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మండిపడ్డారు. 

వెనక్కి తగ్గను

‘‘అవినీతిలో మునిగిపోయిన వాళ్లు.. ఇప్పుడు ఒక్కచోటుకు చేరుతున్నారు. ఒకరినొకరు తిట్టుకున్న వాళ్లు.. ఒక్కటయ్యే సాకులు వెతుక్కుంటున్నారు. వీటన్నింటికీ మోదీ భయపడతాడని వాళ్లు అనుకుంటున్నారు.  అవినీతికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోదీ గ్యారెంటీ’’ అని మోదీ అన్నారు. ‘‘తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తేలేదు. నాపై కుట్రలు పన్నుతున్న వారికి, నా సమాధి తవ్వేందుకు ప్రయత్నించే వారికి.. ‘భయపడే వాడు మోదీ కాదు’ అనే విషయం తెలియదు” అని చెప్పారు.