
గుండెపోటుతో ఇవాళ ఉదయం కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు,అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. డీఎస్ మృతదేహాన్ని ఇవాళ సాయంత్రం నిజామాబాద్ లోని ప్రగతినగర్ లోని తన నివాసానికి తరలించనున్నారు. అంత్యక్రియలు జూన్ 30న జరగనున్నాయి.
1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నుంచి మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989 నుంచి 1994 వరకు మంత్రిగా చేశారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకానొక సమయం డీఎస్ సీఎం రేసులోకి వచ్చారు.
ఉమ్మడి ఏపీలో 2004, 2009లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 లో బీఆర్ఎస్ లో చేరారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన రెండో కొడుకు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.